ఒకే నాని.. మూడు అవతారాలు

0నేచురల్ స్టార్ నాని క్యాలిబర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆర్.ఎక్స్ 100ని కొట్టేసే బుల్లెట్టు లాంటోడు! అంత రేంజు ఉన్నోడే కాబట్టి వరుసగా డబుల్ హ్యాట్రిక్ – ట్రిపుల్ హ్యాట్రిక్ అంటూ అలా అలా స్కైలోకి దూసుకెళ్లిపోతున్నాడు. అడ్డూ అదుపూ లేని దూకుడు నానీది. మధ్యలో ఓ చిన్న కుదుపు ఉన్నా వెంటనే పట్టాలెక్కేసి సూపర్ ఫాస్ట్ ట్రైన్ లా గంటకు నూటయాభై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే కృష్ణార్జున ఫ్లాపవ్వకపోతే అసలు నానీకి ఆ కుదుపు కూడా లేనేలేదు.

ప్రస్తుతం అతడు తెలుగు ప్రేక్షకులకు ఊహించని సర్ ప్రైజ్ ని ఇవ్వబోతున్నాడు. ఇన్నాళ్లు రెగ్యులర్ గా కనిపించానని మదనపడ్డాడో ఏమో.. ఈసారి మాత్రం అసలు ఊహాతీతం అనిపించేందుకే ఫిక్సయ్యాడట. క్రికెట్ నేపథ్యంలో నాని హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో మూడు విభిన్నమైన ఆహార్యాలు – గెటప్పులతో ఒకటే అరిపిస్తాడట. కాలేజ్ విద్యార్థి కం యంగ్ క్రికెటర్ – అలానే పెళ్లయిన నడి వయస్కుడు – ఓల్డ్ మ్యాన్ గా మూడు దశల్లో మూడు రూపాల్లో మెరుపులు మెరిపిస్తాడని తెలుస్తోంది. `మళ్లీ రావా` ఫేం గౌతమ్ తిన్ననూరి నాని చేత ఈ ప్రయోగం చేయిస్తున్నాడు. ఒకే పాత్రలో ఇన్ని షేడ్స్ అంటే నటించేందుకు ఆస్కారం ఎక్కువే. నేచురల్ స్టార్ కి ఇదో ఛాలెంజ్ అనే చెప్పాలి.

అయితే ఇలాంటి ఛాలెంజ్ లు తీసుకోవడం నానీకి ఇదే తొలిసారి కాదు. ఇదివరకూ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో `ఎటో వెళ్లిపోయింది మనసు` చిత్రంలో ఈ తరహాలో నటించాడు. అయితే అప్పట్లో ఓల్డ్ మ్యాన్ పాత్ర లేదు. నిక్కరు తొడిగిన స్కూల్ బోయ్ గా – అటుపై నూనూగు మీసాల కుర్రాడిగా – నడి వయస్కుడిగా మాత్రమే కనిపించాడు. ఆ చిత్రంలో నాని నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు అంతకుమించి నటించి మెప్పిస్తాడనే భావిస్తున్నారంతా.