గెలిచాక పీఎం బయోపిక్ ఎందుకు?

0

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకుల బయోపిక్ లు రిలీజ్ చేయకూడదు అంటూ నానా రచ్చ సాగింది. ఈసీదే ఆ బాధ్యత అంటూ కోర్టులు తప్పించుకున్నాయి. అలా మొదలైన రచ్చ పీఎం నరేంద్ర మోదీ బయోపిక్ పైనా ప్రభావం చూపించింది. ఆ సినిమాని ఎన్నికలకు చాలా ముందే రిలీజ్ చేయాలని భావించినా కోడ్ అమల్లో ఉండడంతో రిలీజ్ చేయడం కుదరలేదు.

`పీఎం నరేంద్ర మోదీ` చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలో ఎన్నికల ముందే రిలీజ్ చేయించాలని చిత్ర కథానాయకుడు- నిర్మాత వివేక్ ఒబేరాయ్ బృందం ఎన్నో ప్రయత్నాలు చేశారు. పోరాటాలు చేశారు. కానీ వీలు పడలేదు. ఎట్టకేలకు ఎలక్షన్ రిజల్ట్ నేడు తేలిపోతోంది. ఇప్పటికే పీఎం నరేంద్ర మోదీ- ఎన్డీయే వర్గాలు గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమైంది. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో ఎన్డీయే మెజారిటీలో కొనసాగడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇదే ఉత్సాహంలో మోదీ బయోపిక్ కి లైన్ క్లియరైంది.

పీఎం నరేంద్ర మోదీ చిత్రాన్ని 2019 రిజల్ట్ డే మరునాడే రిలీజ్ చేస్తున్నామని కొత్తగా పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఒబేరాయ్ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రానికి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించగా.. సందీప్ సింగ్ నిర్మించారు. ఇక ఈసీతో ఏ బెంగా లేదు. యథేచ్ఛగా రిలీజ్ చేసుకోవచ్చు. అయితే ఎన్నికల తర్వాత మోదీ బయోపిక్ రిలీజైతే ఏంటి.. రిలీజ్ కాకపోతే ఏంటి? అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏపీలోనూ `లక్ష్మీస్ ఎన్టీఆర్` రిలీజ్ కి లైన్ క్లియరవుతున్న సంగతి తెలిసిందే. పాపం! ఆర్జీవీ ఇకపై అయినా శాంతిస్తారేమో చూడాలి.