దెయ్యం లా మారనున్ననర్గీస్

0బాలీవుడ్‌లో అందానికి చిరునామాగా నిలిచిన ఆ చిన్నది గత రెండేళ్లుగా తెరమీద కనిపించడమే మానేసింది. ఇప్పుడీ చిన్నది తదుపరి చిత్రంతో జనాన్ని భయపెట్టి పేరు తెచ్చుకోవాలనుకుంటోంది. ఇంతకీ ఎవరా హాట్ బ్యూటీ…?

అభినయంతో అంతగా పని జరగదని ఫీలయ్యే నటీమణులంతా అందాల ఆరబోతకే అగ్రతాంబూలమిచ్చి క్రేజ్ పెంచుకొనే ప్రయత్నం చేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం అందాన్ని, అభినయాన్ని సమపాళ్ళలో రంగరించి వెండితెర మీద రాణించాలని తాపత్రయపడుతుంటారు. ఇందులో రెండో కేటగిరికే ఓటేస్తున్న బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ. గత రెండేళ్లుగా తెరమీద కనిపించకపోయినా సరే తనకు వచ్చిన నష్టమేమీ లేదంటోంది.

‘రాక్ స్టార్’ తో బాలీవుడ్ తెరంగేట్రం చేసిన నర్గీస్ ఫక్రీ.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ముఖ్యపాత్రలు పోషించి బాలీవుడ్ ప్రేక్షకుల మనసులు దోచుకుంది. సల్మాన్ ఖాన్ ‘కిక్’ లో కిక్కెక్కించే సాంగ్‌తో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. అలాంటి నర్గీస్ ఫక్రీ దాదాపు రెండేళ్లుగా బాలీవుడ్ తెరకు దూరంగా ఉంది. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో తన తదుపరి చిత్రాన్ని ట్రాక్‌లో పెట్టేసింది. అయితే ఇందులో కొసమెరుపేమిటంటే ఇది నర్గీస్ తొలిసారి చేస్తున్న దెయ్యం సినిమా కావడమే.

‘అమావాశ్’ అనే సినిమాతో నర్గీస్ ఫక్రీ దెయ్యం అవతారం ఎత్తడం ఇప్పుడు బాలీవుడ్‌లో సెన్పేషన్‌గా మారింది. ఇప్పటి వరకూ నర్గీస్ ఈ జోనర్‌లో సినిమా చేయకపోవడంతో మూవీకి ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ప్రస్తుతం లండన్‌లో ల్యాండయిన ఈ చిత్రం యూనిట్ సభ్యులు అక్కడ 35 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారట. భూషణ్ పటేల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాతో నర్గీస్ ఫక్రీ జనాన్ని భయపెట్టడమే కాదు తన కెరీర్ గ్రాఫ్ కూడా పెంచుకోవాలనుకుంటోంది. మరి అమ్మడి ప్రయత్నం ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలి.