నందమూరి టైటిళ్లతో ఛలో

0కొత్తగా ఓ సినిమా తెరకెక్కించే ముందు ప్రేక్షకుడిని ముందుగా అట్రాక్ట్ చేసేది కాస్టింగ్. ఆ తరవాత ప్రేక్షకులు కనెక్టయ్యేది టైటిల్ తోనే. అందుకే సూటయ్యే ఉండే టైటిల్ కోసం దర్శక – నిర్మాతలు తెర ఆరాటపడతారు. గతంలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీ టైటిల్స్ పెట్టాలంటే మాత్రం కాస్త ఆలోచించాలి. ఎందుకంటే అలాంటి టైటిల్ పెట్టాక ప్రేక్షకుల అంచనాలు కూడా ఓ రేంజిలోనే ఉంటాయి.

యంగ్ హీరో నాగశౌర్య మాత్రం ఇలాంటి సాహసం చేస్తున్నాడు. ఏదో ఒక సినిమాకు కాదు.. ఏకంగా వరసగా రెండు సినిమాలకు నందమూరి హీరోల హిట్ మూవీ టైటిల్స్ ఖాయం చేసేశాడు. నాగశౌర్య సొంత ప్రొడక్షన్ లో వచ్చిన ఛలో సినిమాతో తన కెరీర్ లోనే పెద్ద హిట్ కొట్టాడు. దీని తరవాత వచ్చిన డబ్బింగ్ మూవీ కణం – అమ్మమ్మగారిల్లు రెండూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో తాజాగా మరోసారి సొంత ప్రొడక్షన్ లో కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ తో నర్తనశాల సినిమా చేస్తున్నాడు. విఖ్యాత నటుడు ఎన్టీఆర్ కెరీర్ లో నర్తనశాల చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం. అంత క్రేజ్ ఉన్న నటుడు బృహన్నల పాత్ర పోషించడం అప్పట్లోనే సంచలనం కలిగించింది.

నర్తనశాల తరవాత నాగశౌర్య రాజా కొలుసు డైరెక్షన్ మూవీ చేసేందుకు ఓకే చెప్పాడు. ఈ మూవీకి నారీనారీ నడుమ మురారి టైటిల్ ఖరారు చేశారు. బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ రొమాంటిక్ ఎంటర్ టెయినర్ అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులోని పాటలు కూడా మ్యూజికల్ గా హిట్టయ్యాయి. బాలకృష్ణ కెరీర్ లో రొమాంటిక్ మూవీస్ లో గుర్తుండిపోయే చిత్రమిది. నందమూరి ఫ్యామిలీకి చెందిన రెండు హిట్ సినిమాల టైటిళ్లకు నాగశౌర్య ఎంతవరకు న్యాయం చేస్తాడో చూడాలి.