ట్రైలర్ టాక్: ఆల్ ఇన్ వన్ నాటకం

0ట్రెండ్ అని ఫాలో అవుతున్నారో లేక కొత్త తరహాగా అనిపిస్తోంది కాబట్టి తీస్తున్నారో తెలియదు కానీ టాలీవుడ్ లో మాత్రం బోల్డ్ అప్పీల్ తో ఉంటున్న సినిమాల సంఖ్య పెరుగుతోంది. అన్ని ఒకే తరహాలో సక్సెస్ అవుతాయని చెప్పలేం కానీ మెప్పించే కంటెంట్ ఉంటే మాత్రం ఆదరణకు లోటు ఉండదని ఇటీవలే వచ్చిన ఆరెక్స్ 100 ఋజువు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే పంధాలో వస్తున్న మరో మూవీ నాటకం. ఆశిష్ గాంధీ హీరోగా ఆషిమా నెర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దర్శకుడు కళ్యాణ్ జి గోగన. పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీ కూడా లవ్ స్టోరీనే. పార్వతి అనే అమ్మాయికి కోటేశ్వర్ రావు అనే అబ్బాయికి మధ్య జరిగిన ప్రేమకు మాంచి యాక్షన్ కోటింగ్ ఇచ్చి వయొలెన్స్ దట్టించినట్టు కనిపిస్తోంది. మొదటి నిముషం లీడ్ పెయిర్ మధ్య లవ్ ని కట్ చేసిన టీమ్ తర్వాత నిమిషంన్నర భీభత్సమైన ఫైట్స్ తో దడ పుట్టించేసింది.

ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టే ఇందులో ప్రేమతో పాటు ఘాటైన రొమాన్స్ సీన్లు లిప్ లాక్ కిస్సులు అన్ని ఉన్నాయి. గుబురు గెడ్డంతో హీరో ఆశిష్ గాంధీని చూస్తుంటే రంగస్థలంలో రామ్ చరణ్ గుర్తుకు వస్తే అది మీ తప్పు కాదు. ఇది కూడా పూర్తిగా గ్రామీణ వాతావరణంలో రూపొందిందే. ఆరెక్స్ 100 ఛాయలు లేకపోలేదు. కథ ఎక్కువగా రివీల్ కాకుండా జాగ్రత్తగా ట్రైలర్ ని కట్ చేసారు. ఈ సినిమాకు గరుడవేగా ఫేమ్ అంజి ఛాయాగ్రహణం అందించడం విశేషం. సాయి కార్తీక్ నేపధ్య సంగీతం కథకు తగ్గ మూడ్ లోనే ఉంది. నాటకం అనే వెరైటీ పేరు పెట్టిన టీమ్ ఇందులో అన్ని రసాలు మిక్స్ చేసినట్టే కనిపిస్తోంది. మరి ఈ ఏడాది బాగా అచ్చి వచ్చిన బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న నాటకం ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయని నాటకం రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై రూపొందింది. ట్రెండ్ ని ఫాలో అవుతున్న నాటకం మరి దాన్ని కొనసాగించేలా ఉందో లేదో తేలాలంటే విడుదల దాకా ఆగాల్సిందే.