థియేటర్‌ను కాపాడిన జాతీయ గీతం

0dulquer-salmaan-movieకేరళలో ఓ సినిమా థియేటర్‌ని జాతీయ గీతం కాపాడింది. ఇదేంటి జాతీయ గీతం థియేటర్‌ను కాపడటమేంటి? అనుకుంటున్నారా.. అయితే వివరాల్లోకి వెళ్దాం. మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్‌కు కేరళలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దుల్కర్ నటించిన తాజా సినిమా ‘జొమోంటే సువిశేషంగల్’ ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉత్తర పరవూర్‌లోని చిత్రాంజలి థియేటర్‌లో మొదటి ఆట చూడటానికి వచ్చిన అభిమానులు పువ్వులు, కాగితపు ముక్కలు చేతులతో పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు తమ హీరో ఎంట్రీ ఇస్తే అప్పుడు ఈ పువ్వులు, కాగితపు ముక్కలు గాలిలోకి ఎగరేయాలన్నది వారి ప్లాన్.

తీరా చూస్తే సినిమా సెకాండ్ ఆఫ్ తెరపై దర్శనమిచ్చింది. ప్రొజెక్టర్ రూంలో ఉన్న ఆపరేటర్ మొదటి భాగానికి బదులు రెండో భాగాన్ని తెరపై వేసేసాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన దుల్కర్ అభిమానులు థియేటర్ మేనేజర్ గదివైపు పరుగులు తీసారు. అయితే మేనేజర్ లోపల గడియ పెట్టుకోవడంతో ప్రొజెక్టర్ ఆపరేటర్‌పై దాడి చేసేందుకు వెళ్లారు. అతను స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. ఇంతలో థియేటర్ సిబ్బందిలో ఒకరికి అద్భుతమైన ఉపాయం తట్టింది.

వెంటనే థియేటర్‌లో జాతీయ గీతం ప్లే చేయాలని ఆయన చెప్పారు. జాతీయ గీతం తెరపై రాగానే ఆగ్రహంగా ఉన్న దుల్కర్ అభిమానులు ఒక్కసారిగా కదలకుండా అక్కడే నిలబడిపోయారు. జాతీయ గీతం అయ్యేలోపు అభిమానుల ఆగ్రహం కూడా చల్లారిపోయింది. ఆ తరవాత సినిమాను మొదటి నుంచి వేశారు. ఈ విధంగా థియేటర్ ధ్వంసం కాకుండా జాతీయ గీతం కాపాడింది.

ఈ బాగోతాన్నంతటినీ ఓ ఆకాశరామన్న వాట్సాప్‌లో షేర్ చేసాడు. ఈ సమాచారాన్ని మలయాళ సినీ దర్శకుడు సాజిన్ బాబు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసారు. మొత్తానికి సినిమా ప్రారంభమానికి ముందు జాతీయ గీతాన్ని ప్లే చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశంపై అసంతృప్తిగా ఉన్న థియేటర్ యాజమాన్యాలకు ఇప్పుడు ఆ జాతీయ గీతం పవర్ ఏంటో తెలుసొచ్చింది.