రానాకి జాతీయ అవార్డు ఛాన్స్?

0

దేశవ్యాప్తంగా అన్ని దశల్లో ఎన్నికలు పూర్తయ్యాక జాతీయ అవార్డుల్ని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈసారి టాలీవుడ్ నుంచి ప్రాంతీయ కేటగిరీలో ఓ ఐదు సినిమాలు పోటీపడుతున్నాయి. వీటిలో రంగస్థలం.. మహానటి.. భరత్ అనే నేను.. గీత గోవిందం లాంటి క్రేజీ చిత్రాలతో పాటు కేరాఫ్ కంచరపాలెం లాంటి పరిమిత బడ్జెట్ ప్రయోగాత్మక చిత్రానికి అర్హత దక్కింది. 2018లో రిలీజైన ఈ సినిమాల్లో ఏది అవార్డు గెలుచుకోబోతోంది? ఏ స్టార్ జాతీయ అవార్డు అందుకోబోతున్నారు? అంటూ ప్రస్తుతం ఫిలింనగర్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

రంగస్థలం.. మహానటి పోటీ బరిలో ఠఫ్ కాంపిటీషన్ ఇస్తాయన్న ముచ్చటా సాగుతోంది. అయితే కేరాప్ కంచరపాలెం చిత్రాన్ని తక్కువగా అంచనా వేయలేం. న్యూయార్క్ ఫిలింఫెస్టివల్ లో ప్రదర్శించిన స్పెషల్ మూవీ ఇది. మధ్యతరగతి బడుగు జీవుల జీవితాల్ని కళ్లకు గట్టినట్టు చూపడంలో డెబ్యూ దర్శకుడు వెంకటేష్ మహా అద్భుత పనితనం చూపించారు. వైజాగ్- కంచర పాలెంలో – హైదరాబాద్ రెహమత్ నగర్ రూమ్ లో తాను అనుభవించిన.. ప్రత్యక్షంగా చూసిన కష్టాలు తెరపై చూపించానని దర్శకుడు మహా తెలిపారు. స్క్రీన్ ప్లే పరంగానూ ఉపయోగించిన లాజిక్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధం చేసింది. ఇక ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించిన నిర్మాత పరుచూరి ప్రవీణ చేసిన పాత్రకు ఎంతో గుర్తింపు దక్కింది. ఈ సినిమా షూటింగ్ కోసం ఎంతగా శ్రమించారో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు దర్శకుడు మహా. ఓ ఆటోని అద్దెకు తీసుకుని కొన్ని రోజుల పాటు వైజాగ్ కంచర పాలెం ఏరియాలో షూటింగుకి వెళ్లామని చెప్పారాయన.

చిన్న సినిమా అయినా .. అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ – హీరో దగ్గు బాటి రానా అండగా నిలవడంతో ప్రచారం పరంగా హైప్ దక్కింది. రానా ఈ చిత్రానికి కోప్రొడ్యూసర్ గానూ వ్యవహరించి కావాల్సిన ప్రమోషనల్ సాయం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కమర్షియల్ గానూ ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డుల రేసు నుంచి తప్పించడంపై అప్పట్లో ఆసక్తికర చర్చ సాగింది. ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కలుగజేసుకుని ఎట్టి పరిస్థితిలో ఈ సినిమాని జాతీయ అవార్డుల నామినేషన్స్ కి పంపించాల్సిందిగా సమర్థించారు. ప్రస్తుతం ఈ సినిమాపైనా అందరిలో ఆసక్తి నెలకొంది. పరిశ్రమలోనూ అవార్డు తెస్తుందా? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒక సిన్సియర్ ఎటెంప్ట్ కి అవార్డ్ దక్కితే ఆ నవతరం దర్శకుడి కెరీర్ కి పెద్ద సాయమవుతుందనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాకి సాయం చేసిన రానాకి అవార్డుల పరంగా పేరొస్తుందా? నటీనటులకు గుర్తింపు దక్కుతుందా? అన్నది వేచి చూడాలి.
Please Read Disclaimer