నెపోలియన్ మూవీ రివ్యూ

0nepolianటైటిల్ : నెపోలియన్

జానర్ : క్రైం థ్రిల్లర్

తారాగణం : ఆనంద్ రవి, రవివర్మ, కోమలి

సంగీతం : సిద్ధార్థ్ సదాశివుని

దర్శకత్వం : ఆనంద్ రవి

నిర్మాత : భోగేంద్ర గుప్తా

ఇటీవల తొలి పోస్టర్, టీజర్ నుంచే ఎంతో ఆసక్తి కలిగించిన సినిమా నెపోలియన్. ఓ వ్యక్తి తన నీడ పోయిందంటూ పోలీస్ లను ఆశ్రయించటం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో ఆనంద్ రవి దర్శకుడిగా, నటుడిగా పరిచయం అవుతున్నాడు. నారా రోహిత్ హీరోగా మంచి విజయం సాధించటంతో సినీ విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న ప్రతినిథి సినిమాకు కథ రచయిత ఈ ఆనంద్ రవి. తానే స్వయంగా డైరెక్టర్ గా, ప్రధాన పాత్రలో తెరకెక్కించిన నెపోలియన్ మరోసారి ప్రతినిథి స్థాయిలో ఆకట్టుకుందా..? దర్శకుడిగా.. నటుడిగా ఆనంద్ రవి విజయం సాధించాడా..? అసలు నీడ పోవటమేంటి..?

కథ :

సీఐ రవివర్మ(రవివర్మ).. రొటీన్ కేసులను డీల్ చేసి బోర్ కొట్టిన రవివర్మ ఓ ఆసక్తికరమైన కేసు కోసం ఎదురుచూస్తుంటాడు. అదే సమయంలో నెపోలియన్ (ఆనంద్ రవి) అనే వ్యక్తి నా నీడ పోయిందంటూ కంప్లయింట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అతడ్ని పరీక్షించిన పోలీసులు నిజంగానే నీడపడకపోవటం చూసి షాక్ అవుతారు. ఈ విషయం మీడియాకు లీక్ అవ్వటంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ కేసు హాట్ టాపిక్ గా మారుతుంది. పోలీస్ స్టేషన్ లో ఉన్న నెపోలియన్ మరో షాక్ ఇస్తాడు. తనకు దేవుడు కలలో కనిపించాడని.. నందినగర్ లో చనిపోయిన తిరుపతి అనే వ్యక్తిది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పాడని చెప్తాడు. ఆ కేసును రీ ఓపెన్ చేసిన పోలీసులకు భయంకరమైన నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు ఏంటి..? చనిపోయిన తిరుపతికి నెపోలియన్ కు సంబంధం ఏంటి..? నెపోలియన్ నీడ ఎలా మాయమైంది..? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ :

మూడు కీలక పాత్రల నేపథ్యంలోనే కథ నడవటంతో నటీనటుల గురించి పెద్దగా చెప్పుకోవాల్సినదేమీ లేదు. ఉన్నవాళ్లలో సీనియర్ నటుడైన రవివర్మ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవివర్మ ఒదిగిపోయాడు. తొలిసారిగా నటుడిగా మారిన ఆనంద్ రవి పరవాలేదనిపించాడు. మరో కీలక పాత్రలో నటించిన కోమలి నటన ఆకట్టుకున్నా.. ఆ పాత్రకు పరిచయం ఉన్న నటిని తీసుకుంటే బాగుండనిపిస్తుంది. ప్రతినిథి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆనంద్ రవి తానే దర్శకుడిగా నటుడిగా పరిచయం అయ్యే సినిమాతో మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో మొదలుపెట్టినా.. పోను పోను సినిమా ఓ మామూలు రివేంజ్ డ్రామాల మారింది. సిద్ధార్థ్ సదాశివుని అందించిన నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి , నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

సినిమా మొదలు పెట్టిన విధానం

నేపథ్య సంగీతం

సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్

మైనస్ పాయింట్స్ :

కీలక పాత్రల నటన

స్క్రీన్ ప్లే