రాజమౌళిపై నెటిజన్ల విమర్శలు

0


Rajamouli-Newదర్శక ధీరుడు రాజమౌళి కచ్చితంగా ఇప్పుడు టాలీవుడ్ స్థాయిని మరింతగా పెంచేశాడు. ఇండియన్ మూవీ సత్తా కూడా చాటాడు. ఒక సినిమాతో ఇండియాలో 1000కోట్లకు పైగా వసూళ్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదని ప్రూవ్ చేశాడు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ విజయం అందుకునేందుకు ఈయనకు గత చిత్రాలే మెట్లు అనడంలో సందేహం అక్కర్లేదు.

అప్పటి సంఘటనలపై ఇప్పుడు విమర్శలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎన్టీఆర్ నటించిన సింహాద్రి మూవీతో బ్లాక్ బస్టర్ సాధించి స్టార్ డైరెక్టర్ రేసులోకి వచ్చాడు రాజమౌళి. ఇక రామ్ చరణ్ తో తెరకెక్కించిన మగధీర మూవీతోనే.. బిగ్ కాన్వాస్ అనే ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటివరకూ ఆ స్థాయి బడ్జెట్ ను పెట్టేందుకు ఎవరూ సిద్ధంగా లేరు కూడా. ఇప్పుడు ఆయా చిత్రాలను కొన్ని సెంటర్లలో 100 రోజులు.. 175 రోజులు ఆడించడం తనకు నచ్చలేదని.. అందుకే మగధీర సక్సెస్ ఫంక్షన్ కు కూడా హాజరు కాలేదని చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయం అంటున్నారు నెటిజన్లు.

సింహాద్రి రిలీజ్ అయ్యి 14 ఏళ్లు అయింది.. మగధీర వచ్చి 8 ఏళ్లు గడిచిపోయింది. ఇంతకాలం చెప్పనిది ఇప్పుడు చెప్పడం ఒక విషయం అయితే.. టాలీవుడ్ లో అప్పటి ట్రెండ్ వేరుగా ఉండేది. ఇప్పుడంటే వసూళ్ల లెక్కలతో సక్సెస్- ఫెయిల్యూర్ తేల్చేస్తున్నారు. కానీ దశాబ్దంలో టాలీవుడ్ ట్రెండ్ అదే. ఎన్ని సెంటర్లలో సెంచరీ.. ఎన్ని థియేటర్లలో సిల్వర్ జూబ్లీ లెక్కలే ఉండేవని గుర్తు చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు

అవన్నీ వదిలేసి.. ఆ పాయింట్ పట్టుకుని ఆయా నిర్మాతలను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నది విమర్శకుల వాదన. మగధీర అయినా.. బాహుబలి అయినా.. కొన్ని సీన్లను హాలీవుడ్ మూవీస్ నుంచి స్ఫూర్తి పొంది తీసినవే. కట్టప్ప తలపై శివుడు కాలు పెట్టే సీన్ ను కూడా వేరే సినిమా నుంచి తీసుకున్నానని స్వయంగా చెప్పాడు రాజమౌళి. ఇప్పుడు రాజమౌళి ఓ స్థాయికి చేరుకున్నాడంటే.. అది కచ్చితంగా అప్పటి రికార్డులను బేస్ చేసుకునే అనే విషయాన్ని మర్చిపోయాడని అంటున్నారు పలువురు జనాలు.