హాట్ టాపిక్:చిరు స్పీచులు..రాజమౌళి ట్వీట్లు

0ఒక సినిమా విడుదలకు ముందు దాని గురించి మాట్లాడేటపుడు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. సోషల్ మీడియా చాలా చురుగ్గా ఉన్న ఈ రోజుల్లో ఏమాత్రం నోరు జారినా కష్టం. చిన్న మాటను పట్టుకుని దాని మీద ట్రోలింగ్ మొదలుపెట్టేస్తారు నెటిజన్లు. సినిమా విడుదలకు ముందు ఆహా ఓహో అని పొగిడేసి.. ఆ తర్వాత సినిమా తుస్సుమంటే అంతన్నాడింతన్నాడే అంటూ ట్రోల్ చేస్తారు. సోషల్ మీడియాను మరీ సీరియస్ గా పట్టించుకోవాలని కాదు కానీ.. మామూలు జనాల్లో కూడా తక్కువ అభిప్రాయం రాకుండా చూసుకోవాల్సిన అవసరం సెలబ్రెటీలకు ఉంది. టాలీవుడ్లో తిరుగులేని ఇమేజ్ ఉన్న ఇద్దరు వ్యక్తులు గత కొంత కాలంలో కొన్ని సినిమాల గురించి విడుదలకు ముందు తీర్పులివ్వడం.. వాటి గురించి ఆహా ఓహో అనడం.. ఆ తర్వాత అవి దారుణమైన ఫలితాన్నందుకోవడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. అందులో అగ్ర నిర్మాత దిల్ రాజుతో పాటు మెగాస్టార్ చిరంజీవి.. దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఉన్నారు.

‘దువ్వాడ జగన్నాథం’.. ‘జవాన్’.. ‘కృష్ణార్జున యుద్ధం’.. ‘మెహబూబా’ లాంటి సినిమాల గురించి దిల్ రాజు ఆహా ఓహో అని చెప్పడం.. అవి అంచనాల్ని అందుకోకపోవడంతో రాజు క్రెడిబిలిటీ ఎంత దెబ్బ తిందో తెలిసిందే. ఐతే ఆయన నిర్మాత కాబట్టి తన సినిమాల గురించి అలా మాట్లాడటంలో మరీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ తమవి కాని సినిమాల గురించి చిరంజీవి.. రాజమౌళి అతిగా పొగిడేసి ఇరుకున పడుతున్నారు. చిరు విషయానికి వస్తే తన మిత్రుడు నాగార్జున కొడుకు అఖిల్ నటించిన ‘హలో’.. మేనల్లుడు సాయిధరమ్ సినిమా ‘తేజ్ ఐ లవ్యూ’.. అల్లుడు కళ్యాణ్ దేవ్ చిత్రం ‘విజేత’ల గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. ఆ సినిమాలు చాలా బాగా ఆడేస్తాయన్నాడు. కానీ అవి మూడూ తుస్సుమనిపించాయి.

ఇక రాజమౌళి విషయానికొస్తే తన మిత్రుడైన ‘ఈగ’ నిర్మాత సాయి కొర్రపాటి సినిమాల మీద అమితమైన ప్రేమ చూపిస్తూ వాటిని ప్రమోట్ చేస్తుంటాడు జక్కన్న. ఐతే గత రెండు మూడేళ్లలో సాయి నుంచి వచ్చిన సినిమాలన్నీ తేడా కొట్టేశాయి. ‘పటేల్ సార్’తో పాటు ‘విజేత’ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడి ఇరుకున పడ్డాడు జక్కన్న. మధ్యలో బాలయ్య సినిమా ‘పైసా వసూల్’ గురించి కూడా ఇలాగే మాట్లాడి ఇబ్బంది పడ్డాడు. వీళ్ల మాటల్ని నమ్మి సినిమాలకు వెళ్తున్న జనాలు.. ఆ తర్వాత బయటికి వచ్చి తిట్టుకుంటున్నారు. వీళ్ల క్రెడిబిలిటీ డ్యామేజ్ అవుతోంది. కాబట్టి ఒక సినిమాను విడుదలకు ముందే పొగిడే విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిందే.