కొత్త తరహా పాస్‌పోర్ట్‌ల ముద్రణకు శ్రీకారం

0కొత్త తరహా పాస్‌పోర్ట్‌ల ముద్రణకు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ప్రత్యేకంగా అభ్యర్థుల ఫొటోను నిర్ధారిత ప్రదేశంలో ముద్రించడంతో పాటు దానిని పాస్‌పోర్ట్‌ బుక్‌లెట్‌ లోపలి పేజీలో ‘వాటర్‌ మార్క్‌’ తరహాలో ముద్రిస్తున్నారు. ఈ విధానాన్ని తాజాగా అధికారులు కేంద్ర పాస్‌పోర్ట్‌ కార్యాలయం ఆమోదంతో ప్రవేశపెట్టారు. వాటర్‌ మార్కుతో పాటు ‘ఘోస్ట్‌ ఇమేజ్‌’గా వ్యవహరించే అభ్యర్థుల ముఖభాగాన్ని కూడా మరో పేజీలో ముద్రిస్తున్నారు.

కొత్త పద్దతి వల్ల భద్రతాపరమైన అంశాల్లో ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు జరుపుతున్నామని హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి డాక్టర్‌ ఎన్‌.శ్రీకర్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం రోజూ కనీసం 2200 పాస్‌పోర్ట్‌లను హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం ద్వారా జారీ చేస్తున్నారు. కొత్త బుక్‌లెట్లను పూర్తిగా సమకూరాల్చి ఉన్నందున కొన్ని రోజుల పాటు రోజూ మూడొంతుల కొత్త పాస్‌పోర్ట్‌లను కొత్త పద్ధతిలో, మిగతా వాటిని పాత పద్దతిలోను ముద్రిస్తున్నారు.

కొత్త విధానంతో పొరపాట్లకు ఆస్కారం ఉండదనీ…, అదే విధంగా అభ్యర్థుల ఫొటోలను మార్చడానికి ఎలాంటి అవకాశం ఉండదని అధికారులు నిర్ధారించారు. ముద్రణ ప్రక్రియను సరళతరం చేసేందుకు కూడా నూతన పద్ధతిలో పాస్‌పోర్ట్‌ జారీ ఉపకరిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇక దశల వారీగా అన్ని పాస్‌పోర్ట్‌లను కొత్త విధానంలోనే జారీ చేయనున్నట్లు ఎన్‌.శ్రీకర్‌రెడ్డి తెలిపారు.