బోయ అమ్మాయిగా నిహారిక

0చిరంజీవి సినిమాలో చిన్న పాత్ర చేసినా చాలని ఆయన కుటుంబ హీరోలు పదే పదే చెబుతుంటారు. అయితే ఆ అవకాశం కొద్దిమంది హీరోలకే వచ్చింది. కానీ ఆ కుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్ నిహారికకి మాత్రం చాలా తొందరగా అవకాశం లభించింది. చిరంజీవి కథానాయకుడిగా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `సైరా`లో నిహారిక ఓ పాత్రలో కనిపించబోతోంది. అది ఎలాంటి పాత్ర అనేది నిహారిక బయటపెట్టింది. ఒక బోయ అమ్మాయిగా కనిపించబోతోందట. అది కూడా రెండు సన్నివేశాల్లోనేనట. సంభాషణలు కూడా ఉండవని చెప్పుకొచ్చింది నిహా.

ఆ పాత్ర అవకాశం గురించి ఆమె మాట్లాడుతూ… “సైరాకి నిర్మాత అయిన మా అన్నయ్య చరణ్ ని పెద్దనాన్న సినిమాలో నటించే అవకాశం గురించి అడుగుతూ ఉన్నా. ఒక్క ఫ్రేమ్ లో కనిపించినా చాలని బతిమాలా. అన్నయ్య మాత్రం ` ఆ విషయం నేనెలా చెబుతాను – దర్శకుడు చెబితే కదా నీకు అవకాశం వస్తుంది` అన్నాడు. అప్పుడే దర్శకుడు సురేందర్ రెడ్డి వచ్చాడు. ఆయనతో నా కోరికని చెప్పా. `మీరు నిజంగా చేస్తారా?` అని అడిగారు. డైలాగ్స్ లేకపోయినా ఫర్వలేదా? అన్నారు. పర్లేదు చేస్తా అని చెప్పడంతో నాకు క్యారెక్టర్ ఓకే అయ్యింద“ని చెప్పుకొచ్చింది నిహారిక. అయినా నిహారికలాంటి అమ్మాయిని రెండు సన్నివేశాల్లో.. అది కూడా మాటల్లేకుండా పరిమితం చేయడమనేది మాత్రం టూ మచ్ అనిపించడం లేదూ! మరి ఆ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే సైరా విడుదల వరకు ఆగాల్సిందే.