వెన్నెల కిషోర్ ఏం తప్పు చేశాడు?

0తెరమీదే కాదు.. సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో కామెడీ చేస్తుంటాడు వెన్నెల కిషోర్. ట్విట్టర్లో అతను తన ఫాలోవర్లకు ఎప్పుడూ ఏదో ఒక మేత అందిస్తూనే ఉంటాడు. తన కామెడీ టైమింగ్ చూపించే ఫొటోలతో వినోదం పంచుతుంటాడు. ఇంట్రెస్టింగ్ డిస్కషన్లు పెట్టి జనాల్ని ఎంగేజ్ చేస్తుంటాడు. తాజాగా అతను తాను నటిస్తున్న ‘ముద్ర’ షూటింగ్ సందర్భంగా తీసిన ఒక ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు.

ఇందులో వెన్నెల కిషోర్ అండ్ టీం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. కిషోర్ ఫోన్ పట్టుకుని ఉంటే.. అతడి ముందున్న హీరో నిఖిల్.. సీనియర్ నటి ప్రగతి అతడి వైపు చేతులు చూపిస్తున్నారు. కిషోర్ పక్కన కమెడియన్ విద్యు రామన్ కూడా ఉంది. కిషోర్ ఏదో తప్పు చేస్తే అందరూ అతడిని నిందిస్తున్నట్లుగా ఉంది ఈ ఫొటో చూస్తే. ఈ ఫొటోకు ‘ముద్ర సెట్స్లో నన్ను నిందిస్తున్నారు’ అని కామెంట్ పెట్టాడు కిషోర్. దీనికి అతడి ఫాలోవర్లు రకరకాలుగా స్పందించారు. కిషోర్ ను ఆటపట్టించే ప్రయత్నం కొందరు చేస్తే.. ఇంకొందరు అతడిని పొగిడారు.

ప్రస్తుతం టాలీవుడ్లో వెన్నెల కిషోరే నంబర్ వన్ కమెడియన్ అని చెప్పాలి. ఈ తరానికి తగ్గట్లు సటిల్ కామెడీ చేయడంలో అతను దిట్ట. హావభావాలతో పిచ్చెక్కించేసే అతను భారీగానే అభిమానగణాన్ని సంపాదించుకున్నాడు. అతడిని ట్విట్టర్లో 13 లక్షల మంది అనుసరిస్తుండటం విశేషం. కిషోర్ చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలున్నాయి.