సీఎం కొడుకు టాలీవుడ్ లో రచ్చ

0

మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు.. సినీ నిర్మాత కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామి కుమారుడు నిఖిల్ గౌడ టాలీవుడ్ లో తిరిగి ఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే సమాచారం. అతడు 2016లో జాగ్వార్ అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఎస్.ఎస్.రాజమౌళి బ్యాకప్ – విజయేంద్ర ప్రసాద్ కథ.. రాజమౌళి వద్ద శిష్యరికం చేసిన మహదేవ్ దర్శకత్వం ఇన్ని ఉన్నా.. జాగ్వార్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. సినిమాలో కంటెంట్ తేడా కొట్టడంతో ఆశించిన ఫలితం దక్కలేదు. అదంతా గతం అనుకుంటే వర్తమానంలో సీఎం గారి కుమారుడు తిరిగి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తోంది.

నిఖిల్ గౌడ కథానాయకుడిగా మోహన్ మీడియా క్రియేషన్స్ పతాకంపై మోహన్ వడ్లపట్ల ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. సాంకేతికంగా అత్యున్నతంగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. తెలుగు – కన్నడ ద్విభాషా చిత్రంగా దీనిని రూపొందిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా మరిన్ని వివరాలు సాధ్యమైనంత తొందర్లోనే నిర్మాత తెలియజేస్తారని సమాచారం.

మోహన్ వడ్లపట్ల ప్రస్తుతం ఫిలింఛాంబర్ – నిర్మాతల మండలిలో కొన్ని కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదివరకూ మల్లె పువ్వు – మెంటల్ కృష్ణ – కలవరమాయే మదిలో తదితర చిత్రాల్ని నిర్మించారు. మారిన ట్రెండ్ లో.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారాయన. ఇంతకాలానికి మళ్లీ ఓ సినిమాని నిర్మించేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. ఇదే గాక అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమాని నిర్మించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. అందుకు వీసాల కోసం ప్రయత్నించి అవి రాక ఆలస్యమై ఆ సినిమా అంతకంతకు వాయిదా పడిందని తెలుస్తోంది. మొత్తానికి జాగ్వార్ హీరోని తిరిగి మోహన్ వడ్లపట్ల తెలుగు తెరకు తేనున్నారని తెలుస్తోంది.
Please Read Disclaimer