ముద్ర బలంగా వేస్తున్నారు!

0హడావిడి లేకుండా తన మానాన తాను సినిమాలు చేసుకుంటూ పోయే హీరో నిఖిల్ కొత్త ప్రాజెక్ట్ ముద్ర శరవేగంగా సాగుతోంది. తమిళ్ బ్లాక్ బస్టర్ కనితన్ ఆధారంగా టాగోర్ మధు నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీలో లావణ్య త్రిపాఠి హీరోయిన్. 50 శాతం పైగా షూటింగ్ పూర్తయిపోయిందని యూనిట్ అధికారికంగానే చెబుతోంది. మరో రెండు నెలలలో మొత్తం కంప్లీట్ చేసి దసరా లేదా దీపావళి టైంకి ఫస్ట్ కాపీ సిద్ధం చేసేలా ఉన్నారు. అర్జున్ అనే జర్నలిస్ట్ పాత్ర చేస్తున్న నిఖిల్ సాలిడ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఊహించని విధంగా కిరాక్ పార్టీ షాక్ ఇవ్వడంతో ముద్ర మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన నిఖిల్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో చేసిన కార్తికేయ-ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటివి సూపర్ సక్సెస్ అయ్యాయి కాబట్టి ఇది కూడా అదే కోవలో చేరుతుందని నమ్మకంతో ఉన్నాడు. యూనిట్ మొత్తం హైదరాబాద్ లోనే ఉంటూ కీలక భాగాన్ని షూట్ చేసే పనిలో ఉంది.

ఒరిజినల్ వెర్షన్ టేకప్ చేసిన దర్శకుడు టీఎన్ సంతోష్ తెలుగుని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. సెట్స్ మీద ఉండగానే దీనికి మంచి క్రేజ్ వచ్చేసింది. స్టార్ మాకు అమ్మిన శాటిలైట్ హక్కుల ద్వారా హిందీ తెలుగుకు కలిపి ఐదున్నర కోట్ల దాకా వచ్చినట్టు ఇన్ సైడ్ టాక్. ఇది చాలా మంచి డీల్. ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్ట్ కావడంతో పాటు థ్రిల్లర్ గా ప్రేక్షకులు ఊహించలేని అంశాలు ఇందులో ఉన్నందున ముద్ర గట్టి ముద్రే వేస్తుందని టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. వరుస సినిమాలు చేయటం కన్నా ఒక్కొక్కటి చేసే దానికి ప్రాధాన్యత ఇచ్చే నిఖిల్ ముద్ర పూర్తయ్యే దాకా కొత్త సినిమా ఆలోచన చేసేలా లేడు. ఒక జర్నలిస్ట్ కి క్రైమ్ తో ముడిపడటం అనే ఇంటరెస్టింగ్ పాయింట్ మీద రాసుకున్న ముద్ర గురించి నిఖిల్ ఫాన్స్ అప్పుడే హిట్ అనే గ్యారెంటీతో ఉన్నారు. ఫస్ట్ లుక్ గతంలోనే విడుదల చేసిన నేపథ్యంలో టీజర్ మరో రెండు మూడు వారాల్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది.