అరుదైన రికార్డ్ కు 25 ఏళ్లు.. బాలయ్యకే సాధ్యం

0టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలు సంవత్సరంలో కేవలం ఒక్క సినిమాను మాత్రమే విడుదల చేయగలుగుతున్నారు. కొందరు హీరోలు సంవత్సరం మొత్తంలో కనీసం ఒక్కటి కూడా విడుదల చేయలేక పోతున్నారు. సినిమా నిర్మాణ వ్యయం పెరగడంతో పాటు * ఒక సినిమా చేస్తున్న సమయంలో మరో సినిమాకు కమిట్ అవ్వకూడదని హీరోలు – దర్శకులు అనుకుంటున్న కారణంగా సినిమాలు చాలా తక్కువగా చేస్తున్నారు. కాని 1980 మరియు 90లలో మాత్రం స్టార్ హీరోలు చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్ ఇతర హీరోలు నెలకు ఒకటి రెండు చిత్రాల చొప్పున చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంత స్పీడ్ గా చిత్రాలను చేశారు కనుకే చిరంజీవి 150 చిత్రాలు – బాలయ్య 100 చిత్రాలను పూర్తి చేశారు. ఇక బాలయ్య కెరీర్ లోనే కాకుండా సినీ ఇండస్ట్రీలోనే అరుదైన రికార్డు సరిగ్గా 25 ఏళ్ల క్రితం నమోదు అయ్యింది.

బాలకృష్ణ నటించిన ‘నిప్పురవ్వ’ మరియు ‘బంగారు బుల్లోడు’ చిత్రాలు రెండు కూడా 1993 – సెప్టెంబర్ 3వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒక స్టార్ హీరో రెండు చిత్రాలు ఒకే రోజున రావడం సంచలనం. కొన్ని అత్యవసర కారణాల వల్ల రెండు చిత్రాలను కూడా ఒకే రోజున విడుదల చేయడం జరిగింది. అప్పట్లో భారీ బడ్జెట్ తో నిర్మాణం జరిగిన ‘నిప్పురవ్వ’ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. సినిమా కారణంగా సింగరేణిలో ప్రమాదం జరిగిందంటూ విమర్శలు రావడంతో సినిమా విడుదలలో గందరగోళం నెలకొందని నందమూరి అభిమానులు చెబుతూ ఉంటారు. అప్పటి స్టార్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిప్పురవ్వ’ చిత్రంలో హీరోయిన్ గా విజయశాంతి నటించారు.

ఇక బాలయ్య ‘బంగారు బుల్లోడు’ చిత్రానికి రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘నిప్పురవ్వ’ చిత్రం అంచనాలను అందుకోవడంలో విఫలం కాగా – ‘బంగారు బుల్లోడు’ చిత్రం మాత్రం శతదినోత్సవం జరుపుకుంది. ఈ 25 ఏళ్లలో ఏ హీరో రెండు చిత్రాలు కూడా ఒకే రోజు విడుదల కాలేదు. అంతకు ముందు కూడా విడుదలైనట్లుగా దాఖలాలు లేవు. అందుకే బాలయ్య ఖాతాలోనే ఈ అరుదైన రికార్డు చేరిందని అభిమానులు గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. బాలయ్య ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నా కూడా ఇది మాత్రం చాలా ప్రత్యేకం అంటూ అభిమానులు అంటూ ఉంటారు.