ఆ రాత్రి మోక్షజ్ఞతో నిషిత్ నారాయణ భేటీ

0Nisith-and-mokshagnaఊహించని ప్రమాదంలో అర్ధాంతరంగా జీవితాన్ని ముగించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ తన జీవితంలో అనేక కలలు కని ఉంటాడు. ఎంతో ఉన్నత స్థాయి ఎదుగుతాడనుకున్న కుమారుడు హఠాన్మరణం మంత్రి నారాయణ కుటుంబంలో తీరని విషాదమే నింపింది. కాగా, మంత్రి నారాయణ కుమారుడు నిశిత్‌కు సినిమా రంగంపై అమితమైన ఆసక్తి ఉన్నట్లు తెలిసింది.

అంతేగాక, ప్రముఖ టాలీవుడ్ నటుడు, హిందూపురం తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో ఓ సినిమా తీయాలని కూడా నిశిత్ యోచించినట్లు సమాచారం. దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ వారసడైన బాలకృష్ణ కుమారుడి సినిమా అంటే భారీ అంచనాలుంటాయన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞను ఓ భారీ చిత్రంతో ఆరంగేట్రం చేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, హైదరాబాద్‌లో ప్రమాదానికి ముందే.. నిశిత్, రవిచంద్ర తదితరులు మోక్షజ్ఞతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోక్షజ్ఞ తొలి చిత్రంపై విస్తృతంగా చర్చించినట్లు తెలిసింది.

కాగా, దాదాపు రాత్రి 12గంటల సమయంలో బాలయ్య ఫోన్ చేసి, ఇప్పటికే లేటైపోయిందని కోప్పడటంతో ఆ సమావేశం నుంచి మోక్షజ్ఞ ఇంటికి బయలుదేరాడట. ఆ తర్వాత కొంతసేపు వరకు నిశిత్, రాజారవివర్మలు అక్కడేవుండి.. ఆ తర్వాత బెంజ్ కారులో వారు కూడా బయల్దేరారట. ఆ రాత్రి మెట్రో పిల్లర్ ప్రమాదంలో ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే.

అంతలోనే మెట్రో పిల్లర్ ఢీకొని.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లో బుధవారం(మే10న) తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్‌ నారాయణ(22), అతడి స్నేహితుడు రాజారవివర్మ మృతి చెందారు. వీరిద్దరూ ప్రయాణిస్తున్న బెంజ్‌ కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అతివేగం, సీట్ బెల్టు పెట్టుకోకపోవడంతో వీరిద్దరూ మరణం నుంచి తప్పించుకోలేకపోయారు.