నీతా అంబానీకి అరుదైన గౌరవం

0nita-ambaniప్రముఖ క్రీడా ఔత్సాహికురాలు, వ్యాపారవేత్త నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ)లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ మహిళగా రికార్డుల్లోకెక్కిన నీతా తాజాగా గవర్నింగ్ బాడీకి చెందిన రెండు కీలక కమిషన్లలో సభ్యురాలుగా ఎంపికైంది.

ప్రతిష్ఠాత్మక ఒలింపిక్ చానెల్‌తో పాటు ఒలింపిక్ విద్యా కమిషన్‌లో 53 ఏండ్ల అంబానీని సభ్యురాలిగా నియమిస్తూ ఐవోసీ నిర్ణయం తీసుకుంది. ఈ యేడాదికి గాను ఐవోసీ మొత్తం 26 కమిషన్లను ప్రకటించింది. అమెరికా ఒలింపిక్ కమిటీ చైర్మన్ లారెన్స్‌ఫ్రాన్సిస్ అధ్యక్షత వహిస్తున్న 16 మంది సభ్యులతో కూడిన ఒలింపిక్ చానెల్‌లో నీతా భాగం కానుంది.

ఐవోసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటీ నుంచి థామస్ బాచ్ పలు కీలక నిర్ణయాలతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని మహిళల భాగస్వామ్యాన్ని అంతకంతకు పెంచుతున్నారు. ఇప్పటికే ఐవోసీ కమిషన్‌లో రికార్డు స్థాయిలో 38 శాతం మహిళలు పదవుల్లో కొనసాగుతుండగా, మరిన్ని స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశాలున్నాయి.