నితిన్ వరుసగా మూడోసారి

0త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అఆ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నా నితిన్ కు పరాజయాల బెడద తప్పడం లేదు. ఒకసారి కంటెంట్ ఫలితాన్ని శాశిస్తే మరోసారి పరిస్థితులు ప్రతికూలంగా ఉంటున్నాయి. గత మూడు సినిమాల రిజల్ట్ చూస్తే ఇదే అనిపిస్తుంది. గత ఏడాది లై విడుదల చేసినప్పుడు అదే రోజు పోటీలో ఉన్న నేనే రాజు నేనే మంత్రి-జయ జానకి నాయకుకు ఎదురెళ్ళడం కొంత డ్యామేజ్ చేసింది. మరీ తీసికకట్టుగా లేకపోయినా లైలో ఉన్న కంటెంట్ కంటే మిగిలిన రెండు సినిమాల్లో మాస్ అంశాలు ఎక్కువగా ఉండటంతో పండగ సీజన్ ని లై వాడుకోలేక ఆఖరికి ప్లాప్ ముద్ర వేయించుకుంది. దానికి మరో ప్రధాన కారణం ఓవర్ బడ్జెట్. నితిన్ మార్కెట్ కి మించి సుమారు 40 కోట్ల దాకా దర్శకుడు హను రాఘవపూడి దీనికి ఖర్చు పెట్టించడం కూడా ప్రతికూలంగా మారిందని అప్పుడే కథనాలు వచ్చాయి. టీవీ టెలికాస్ట్ చూసినప్పుడు ప్రేక్షకులు వ్యక్తం చేసిన అభిప్రాయం దీనిని బలపరుస్తోంది.

ఇక ఈ ఏడాది మార్చ్ లో వచ్చిన చల్ మోహనరంగా యావరేజ్ ఎంటర్ టైనర్ గా ఓ మోస్తరుగా మెప్పించే మెటీరియల్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీ హిట్ రంగస్థలంకు దీనికి కేవలం 5 రోజుల వ్యత్యాసం మాత్రమే ఉండటం కలెక్షన్ పరంగా తీవ్ర ప్రభావం చూపించింది. నెల రోజుల దాకా కొనసాగిన రంగస్థలం హ్యాంగ్ ఓవర్ ముందు అంత తక్కువ సమయంలో వచ్చిన చల్ మోహనరంగాపై ప్రేక్షకులు అంతగా దృష్టి పెట్టలేదు. ఒకవేళ రంగస్థలం లాంటి సినిమా లేని టైంలో సోలోగా వచ్చి ఉంటె హిట్ అయ్యే ఛాన్స్ ఉండేదని ఫాన్స్ ఇప్పటికీ ఫీలవుతుంటారు. ఆ రకంగా మరోసారి నితిన్ రాంగ్ టైమింగ్ తో ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.

ఇక మొన్న వచ్చిన శ్రీనివాస కళ్యాణం విజయవంతంగా హ్యాట్రిక్ కొట్టించేసింది. పైన చెప్పినట్టుగా దీనికి పోటీ ప్రతికూలంగా లేదు. ఉన్న విశ్వరూపం 2 కూడా అందరికి టార్గెట్ చేసిన మూవీ కాదు కాబట్టి ఫామిలీ ఆడియన్స్ దీనివైపే మొగ్గు చూపారు. కానీ ఆ అంచనాలు నిలబెట్టుకోలేదు. గత వారం రిలీజైన గూఢచారి తప్ప బలమైన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లేదు. అయినా కూడా శ్రీనివాస కళ్యాణం ఈ అవకాశాన్ని వాడుకోలేదు. చల్ మోహనరంగా కంటే బెటర్ రిలీజ్ దక్కినా లాభం లేకపోయింది. పెళ్లి తప్ప కథ లేకుండా సతీష్ నడిపించిన తీరుకి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చేసింది. సో ఏది ఎలా ఉన్నా దెబ్బైపోయింది మాత్రం పాపం నితినే. హ్యాట్రిక్ ఎలాగూ అయిపోయింది కాబట్టి ఇకనైనా జాగ్రత్త వహిస్తే బెటర్. త్వరలో ప్రారంభం కానున్న వెంకీ కుడుముల భీష్మ(వర్కింగ్ టైటిల్)మీదే నితిన్ ఆశలన్ని ఉన్నాయి. ఛలో లాంటి ఎంటర్ టైనర్ ని డీల్ చేసిన విధానం నచ్చడంతో దర్శకుడు వెంకీ కుడుములు తనకూ ఓ బ్రేక్ ఇస్తాడనే నమ్మకంతో ఉన్నాడు నితిన్. చూడాలి భీష్మతో అయినా దశ తిరుగుతుందేమో.