#RRR లో నిత్యామీనన్.. పాత్ర ఇదే?

0

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం షూటింగ్ చిన్న గ్యాప్ తీసుకుని మళ్లీ మొదలు పెట్టేందుకు సిద్దం అయ్యారు. ఇక ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా ఆలియా భట్ ను ఎంపిక చేయగా మరో హీరోయిన్ పాత్రకు గాను డైజీ అనే ఇంగ్లీష్ నటిని ఎంపిక చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల డైజీ తప్పుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ కోసం మరో హీరోయిన్ ను వెదికుతున్నారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ కు జోడీగా నిత్యామీనన్ ను ఎంపిక చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఇటీవలే ఎన్టీఆర్ పాత్ర కోసం నటిని ఎంపిక చేసేందుకు ఆడిషన్స్ కూడా జరిగాయని ప్రచారం జరిగింది. తాజాగా ఆ పాత్రకు గాను నిత్యామీనన్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ ను ఆరాధించే గిరిజన యువతి పాత్రలో నిత్యామీనన్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. రాజమౌళి కొన్ని రోజుల క్రితం ప్రెస్ మీట్ లో చెప్పిన దాని ప్రకారం కొమురం భీం ముగ్గురు భార్యలను కలిగి ఉండేవాడు. అందుకే ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా ఒక విదేశీ నటితో పాటు సౌత్ ట్యాలెంటెడ్ హీరోయిన్ అయిన నిత్యామీనన్ ను కూడా ఎంపిక చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది.

రాజమౌళి సినిమాలో నటించేందుకు హీరోయిన్స్ క్యూ కడతారు. అలాంటిది నిత్యామీనన్ కు ఆ ఛాన్స్ దక్కడంతో వెంటనే ఓకే చెప్పేసిందట. సినిమాలో కొన్ని సీన్స్ లో మాత్రమే నిత్యామీనన్ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ కు భార్యగా కనిపించనుందా లేదంటే ప్రేయసిగా కనిపించబోతుందా అనే విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.




Please Read Disclaimer