నిత్యమీనన్.. చడీ చప్పుడు లేకుండా

0

దక్షిణాదిన గత దశాబ్దాంలో గొప్ప పేరు సంపాదించిన హీరోయిన్లలో నిత్యా మీనన్ ఒకరు. సొంతగడ్డ మలయాళంలో సత్తా చాటుకున్నాక ఆమె తెలుగు.. తమిళ భాషల్లోకి అరంగేట్రం చేసి మంచి మంచి పాత్రలు చేసింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా నిత్య ఎలాంటి పాత్ర చేసినా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. పాత్రల ఎంపికలో చాలా సెలెక్టివ్గా ఉండే నిత్య… ఒక సినిమా చేస్తోందంటే అందులో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందని నమ్ముతారు జనాలు. ఐతే గత రెండు మూడేళ్లలో నిత్య జోరు తగ్గింది. సినిమాల ఎంపికలో ఆమె మరీ సెలెక్టివ్ అయిపోయింది. పైగా బాగా లావైపోవడం వల్ల కూడా నిత్యకు అవకాశాలు తగ్గాయి. ఐతే కొంచెం గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆమె మళ్లీ బిజీ అవుతున్నట్లు కనిపిస్తోంది. తమిళంలో జయలలిత బయోపిక్ తో పాటు తెలుగులో ‘యన్.టి.ఆర్’ సినిమాలో సావిత్రిగానూ కనిపిస్తోంది నిత్య.

వీటితో పాటు హిందీలో ఒక క్రేజీ ప్రాజెక్టులో నిత్య అవకాశం దక్కించుకోవడం విశేషం. విలక్షణ దర్శకుడు ఆర్.బాల్కి దర్శకత్వంలో అక్షయ్ హీరోగా తెరకెక్కబోయే ‘మిషన్ మంగళ్’ అనే సినిమా మొదలవుతోంది. ఇది మహిళలు అంతరిక్ష యానం చేసే నేపథ్యంలో సాగుతుందట. మహిళా సాధికారత ప్రధాన అంశంగా సినిమాను తెరకెక్కించనున్నారట. ఇందులో అక్షయ్ తో పాటు విద్యాబాలన్.. నిత్యామీనన్.. సోనాక్షి సిన్హా కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని చాటుతూ.. వారికి అండగా నిలిచే శాస్త్రవేత్తగా అక్షయ్ కనిపిస్తాడట. కొన్నేళ్లుగా అక్షయ్ సామాజిక అంశాలతో కూడిన మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది అతను బాల్కితో కలిసి ‘ప్యాడ్ మ్యాన్’ లాంటి మంచి సినిమా చేశాడు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మిషన్ మంగళ్’ను నిర్మించనుంది.




Please Read Disclaimer