కేటీఆర్ ఊసే లేని నోటా!!

0

నిన్న విడుదలైన విజయ్ దేవరకొండ నోటా టాక్ సంగతి అలా ఉంచితే హైప్ పుణ్యమా అని ఓపెనింగ్స్ మాత్రం అదరగొట్టాడు. తన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి బాక్స్ ఆఫీస్ కు తెలిసివచ్చింది. కాని అది నిలవాలి అంటే కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరిక కూడా నోటానే ఇచ్చింది. ఇక ప్రీ రిలీజ్ లో విజయ్ దేవరకొండ పలుమార్లు ఇందులో రాజకీయ నాయకుడిగా కనిపించేందుకు తెలంగాణా ఐటి మినిస్టర్ కేటిఆర్ ని స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పాడు.

కాని విచిత్రంగా హీరో బాడీ లాంగ్వేజ్ లో ఎక్కడా ఆ ఛాయలు కనిపించవు. పైగా లైఫ్ ని చాలా తేలిగ్గా తీసుకునే ఒక ఈజీ గోయింగ్ గయ్ గా ఉన్న విజయ్ దేవరకొండ ఇష్టం లేకపోయినా హాఠాత్తుగా సీఎం అవుతాడు. అంటే ఇంతకు ముందు కేటీఆర్ ప్రస్తావన తెచ్చిన విజయ్ ఇన్ డైరెక్ట్ గా సినిమాలో ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాక సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విశ్లేషణలు వాళ్ళు చేసేసుకుంటున్నారు.

ఇక క్లైమాక్స్ లో ఎన్నికల ప్రస్తావన తెచ్చి ఇంటింటికి వెళ్లి ఓట్లు బ్రతిమాలుకోవడం కన్నా మూసి నదిని ప్రక్షాళన చేస్తే ప్రజలే గెలిపిస్తారని చెప్పడం చూస్తే ఇదేదో మేనిఫెస్టో లో పెట్టమని చెప్పినట్టుగా ఉందే అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. నిజానికి దర్శకుడు ఆనంద్ శంకర్ ఉద్దేశం వేరు. గతంలో చెన్నైలో వరదలు వచ్చినప్పుడు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే నగర జీవనం అస్తవ్యస్తమయ్యింది. అది దృష్టిలో ఉంచుకునే పరిష్కారంగా సిటీలో ఉన్న నదులను క్లీన్ చేయాలనీ చెప్పించాడు.

తెలుగు డబ్బింగ్ వెర్షన్ కాబట్టి అందులోనూ విజయ్ దేవరకొండ స్వతహాగా హైదరాబాద్ వాసి కావడం వల్ల దాన్ని మూసిగా మార్చేశారు. ఏదైతేనేం నోటాలో ఉన్న రాజకీయ అంశాలు కొన్ని ఇక్కడి వాతావరణానికి తగ్గట్టు ఉన్నా మెజారిటీ కథ మాత్రం పూర్తిగా తమిళ రాజకీయాలతో ముడిపడి ఉందన్నది వాస్తవం. పూర్తి స్థాయిలో మన ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడానికి కారణం కూడా ఇదే.
Please Read Disclaimer