యుఎస్ వెడ్డింగ్ హ్యాపీగా లేదా?

0ఒక మనసు తర్వాత బాగా గ్యాప్ తీసుకుని మెగా డాటర్ నీహారిక చేస్తున్న హ్యాపీ వెడ్డింగ్ సంప్రదాయానికి భిన్నంగా శనివారం విడుదల అవుతోంది. పోటీ విపరీతంగా పెరిగిపోతున్న నేపధ్యంలో టాలీవుడ్ మేకర్స్ ఈ మధ్య సెంటిమెంట్లను కూడా పక్కన పెట్టేస్తున్నారు. బుధవారం గురువారంతో పాటు మెల్లగా శనివారం కూడా రిలీజ్ కు అనుకూలంగా మారిపోతోంది. 27న సాక్ష్యంతో పాటు త్రిష మోహిని రేస్ లో ఉండటంతో హ్యాపీ వెడ్డింగ్ తాపీగా సాటర్ డే ఫిక్స్ చేసుకుంది. బహుశా నీహారిక అన్నయ్య వరుణ్ తేజ్ తొలిప్రేమ ను స్ఫూర్తిగా తీసుకున్నట్టు ఉంది యువి టీమ్. ఇంటెలిజెంట్ తో క్లాష్ వచ్చినప్పుడు తొలిప్రేమను ఒకరోజు వాయిదా వేసి శనివారం విడుదల చేస్తే ట్రెండ్ కి భిన్నంగా అది సూపర్ హిట్ అయ్యింది. ఆ కాన్ఫిడెన్స్ తో కాబోలు హ్యాపీ వెడ్డింగ్ కు కూడా అదే ఫాలో అవుతున్నారు.

ఇక హ్యాపీ వెడ్డింగ్ మీద భీభత్సమైన హైప్ అయితే ప్రస్తుతానికి లేదు కానీ మొదటి ఆటకు వచ్చే టాక్ రివ్యూల మీద యూనిట్ చాలా నమ్మకంగా ఉంది. కంప్లీట్ ఫామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి యూత్ తో పాటు అందరిని అలరిస్తుందనే యువి సంస్థ ధీమా. కానీ కీలకమైన యుఎస్ మార్కెట్ లో ఆశించినంత స్పందన లేకపోవడం కూడా కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ కి సాధారణంగా అక్కడ ప్రీ రిలీజ్ బజ్ బాగా ఉంటుంది. కానీ హీరో సుమంత్ అశ్విన్ ఇమేజ్ వీక్ గా ఉండటంతో పాటు హీరోయిన్ నీహారిక మెగా హీరోయిన్ అయినప్పటికీ సోలోగా క్రౌడ్ ఫుల్లర్ కాకపోవడంతో ఫస్ట్ డే వండర్స్ జరిగే అవకాశాలు తక్కువ.

గతంలో అఆ-ఫిదా లాంటి ఫ్యామిలీ మూవీస్ ఈజీగా రెండు మిలియన్ డాలర్లు తెచ్చి పెట్టాయి. దానికి కారణం ఒకటే. మంచి ఫీల్ తో ఎమోషన్ ని బాగా చూపించిన విధానం. హ్యాపీ వెడ్డింగ్ లో అవి ఉన్నాయా లేదా అనేది మొదటి ఆట పడ్డాకే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అది తెలుసుకుని వెళదాం అనుకునే ధోరణి ప్రవాసాంధ్రుల్లో ఉండే అవకాశం ఉంది. సో అది ప్రభావం చూపింది అంటే హ్యాపీ వెడ్డింగ్ కు ఓవర్సీస్ లో ఆశించిన స్పందన దక్కదు. టీమ్ ఇక్కడైతే బాగా ప్రమోట్ చేస్తోంది కానీ యుఎస్ మార్కెట్ మన కంట్రోల్ లో లేనిది. అక్కడ ప్రభావితం చేయాలంటే బలమైన కారణాలు కావాలి. మరి యుఎస్ లో వెడ్డింగ్ హ్యాపీగా జరుగుతుందా లేదా అనేది తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. యువి సంస్థ నిర్మించిన హ్యాపీ వెడ్డింగ్ ద్వారా లక్ష్మణ్ కార్య దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.