కేరళకు టాలీవుడ్ విరాళ వర్షం

0దేవుడి స్వర్గంగా చెప్పుకునే కేరళకు తీరని కష్టం వచ్చి పడింది. పేపర్లలో టీవీలలో బాధితుల పరిస్థితిని ఇంట్లో కూర్చుకుని చూస్తుంటేనే హృదయం ద్రవించిపోతోంది. అలాంటిది అక్కడ ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్న వారి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది. దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కదలిస్తున్న ఈ విషాద సంఘటన నుంచి కోలుకోవడం కోసం కేరళ వాసులకు అండగా నిలవడం కోసం సామాన్యులు మొదలుకుని సెలెబ్రిటీల వరకు అందరు తమ వంతు చేయూత ఇస్తున్నారు. అధిక శాతం డబ్బు రూపంలో విరాళం అందజేస్తూ ఉండగా కొన్ని సంస్థలు వస్తువులు ఆహరం కూడా ప్రత్యేక వాహనాల ద్వారా పంపుతున్నాయి. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ఇక్కడ విరాళాల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటి దాకా తమకు తోచిన రీతిలో కొద్ది మొత్తం నుంచి అతి భారీగా అందించిన వాళ్లలో విజయ్ దేవరకొండ-అల్లు అర్జున్-చిరంజీవి-రామ్ చరణ్-రామ్ పోతినేని-కొరటాల శివ ఉండగా ఇలా ఈ లిస్ట్ అంతకంతకు పెరుగుతూ పోతోంది.

తాజాగా నందమూరి సోదరులు కూడా తోడయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ 25 లక్షలు ప్రకటించగా అన్నయ్య కళ్యాణ్ రామ్ 10 లక్షలు అనౌన్స్ చేసి మిగిలినవారికి స్ఫూర్తినిచ్చాడు. ఇక నాగార్జున సతీసమేతంగా 28 లక్షలు ప్రకటించగా ఇంకా ఇది కొనసాగేలా ఉంది. అల్లు అర్జున్ ని కలుపుకుని మెగా ఫామిలీ నుంచే ఇప్పటి దాకా ప్రకటించిన మొత్తం కోటి రూపాయల దాకా చేరుకుంటోంది. స్టార్ హీరోలందరూ పాతిక లక్షలు తగ్గకుండా ప్రకటించడం విశేషం. 400 పైగా ప్రాణాలు బలితీసుకున్న వరద వల్ల కలిగిన ఆస్థి నష్టం మాత్రం ఊహకందడం లేదు. బాగా బ్రతికిన కుటుంబాలు సైతం సహాయక శిబిరాల్లో బిక్కుబిక్కు మంటూ ఆహరం కోసం వేచి చూస్తున్నాయి. ఈ రోజు కొద్దిగా వర్షం తగ్గడం కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది. జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే సహాయం ఇక్కడితో ఆగకూడదు. ఎంత లేదన్నా పూర్తి స్థాయిలో కేరళ కోలుకోవడానికి మరో ఆరు నెలలైనా పడుతుందని నిపుణుల అంచనా.