‘యన్.టి.ఆర్’ పై అన్నదమ్ములు మాట్లాడరే..

0

కొన్నిసార్లు విషాద ఘటనలే మనుషుల మధ్య అంతరాల్ని తొలగిస్తాయి. దగ్గర చేస్తాయి. నందమూరి కుటుంబంలో ఇటీవలి విషాదం ఇలాగే మనుషుల్ని దగ్గర చేసేలా కనిపించింది. హరికృష్ణ మరణంతో ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ కు.. బాలకృష్ణకు మధ్య దూరం తగ్గినట్లే కనిపించింది. అన్న మరణానంతరం కొన్ని రోజుల పాటు ఆ కుటుంబంతోనే ఉన్నాడు బాలయ్య. అంత్య క్రియలతో పాటు మిగతా కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకున్నాడు.

దీంతో బాబాయి-అబ్బాయి మధ్య ఇంతకుముందున్న విభేదాలన్నీ సమసిపోయాయని.. ఇకపై వీళ్లిద్దరూ సన్నిహితంగా మెలుగుతారని అభిమానులు ఆశించారు. ఈ నేపథ్యంలోనే ‘అరవింద సమేత’ ఆడియో వేడుకకు బాలయ్య ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ తీరా చూస్తే అలాంటిదేమీ జరగలేదు. ఈ వేడుకలో కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ మాట్లాడిన తీరు చూసినా పరిస్థితి యథాతథంగా ఉందని స్పష్టమైంది. తన ప్రసంగంలో ఎక్కడా ఎన్టీఆర్ బాలయ్య ప్రస్తావన తేలేదు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అవుతున్న ‘యన్.టి.ఆర్’ గురించి తారక్-కళ్యాణ్ రామ్ ఏమీ స్పందించకుండా సైలెంటుగా ఉండటం చర్చనీయాంశమవుతోంది. ‘యన్.టి.ఆర్’ బయోపిక్ ను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ వీటి టైటిళ్లు.. రిలీజ్ డేట్లు కూడా వెల్లడించారు. ఐతే దీని గురించి అన్నదమ్ములు మాట్లాడట్లేదు. ఎన్టీఆర్ అయినా బాబాయికి మరీ దూరంలే అనుకోవచ్చు. బాలయ్యతో సత్సంబంధాలున్నట్లే కనిపించే కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమా గురించి స్పందించట్లేదు. పైగా అతను ఈ చిత్రంలో హరికృష్ణ పాత్ర పోషిస్తున్నాడు కూడా. అయినా ఆ సినిమా గురించి స్పందించకపోవడమేంటి?

అసలు తన తండ్రి మరణానంతరం కొన్ని రోజులకే తారక్ ‘అరవింద సమేత’ షూటింగుకి వెళ్లాడని చెప్పిన కళ్యాణ్ రామ్.. తాను ‘యన్.టి.ఆర్’ షూటింగుకి హాజరైన విషయాన్ని కూడా ప్రి రిలీజ్ ఈవెంట్లో వెల్లడించలేదు. అలా మాట్లాడితే తమ్ముడికి ఇష్టముండదనుకున్నాడో ఏమో మరి. మొత్తానికి హరికృష్ణ మరణం తర్వాత పరిస్థితులు మారిపోతున్నాయని.. బాబాయి-అబ్బాయి కలిసిపోతున్నారని ఆశించిన నందమూరి అభిమానులకు నిరాశ తప్పనట్లే ఉంది.
Please Read Disclaimer