నా సంతోషానికి జన్మదిన శుభాకాంక్షలు: ఎన్టీఆర్

0NTR-Birthday-Wishes-to-Abhay

ఎలాంటి వ్యక్తి అయినా.. తండ్రి అయ్యాక వచ్చే మార్పు అసాధారణం అంటారు. ఎంతో కఠినంగా.. వయొలెంట్ గా ప్రవర్తించే వాళ్లు కూడా తండ్రి కాగానే సాత్వికంగా మారిపోతారంటారు. దూకుడు తగ్గిపోతుందని.. మాటల్లో పరిణతి వస్తుందని.. ఇంకా చాలానే చెబుతారు. మన టాలీవుడ్ స్టారోల్లో కూడా చాలామంది తండ్రి అయ్యాక ఎంతగా మారారో స్పష్టంగా తెలిసొచ్చింది. మహేష్ బాబు.. అల్లు అర్జున్.. జూనియర్ ఎన్టీఆర్.. వీళ్లందరిలోనూ తండ్రి అయ్యాక ఎంతో మార్పు కనిపించింది.

వీరిలో ఫాదర్ హుడ్ గురించి మీడియాతో ఎక్కువగా తన అనుభూతుల్ని పంచుకున్నవాడు ఎన్టీఆర్. తన సినిమాలకు సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొన్నా.. ఇంకేదైనా కార్యక్రమంలో పాల్గొన్నా తన కొడుకు అభయ్ రామ్ గురించి మాట్లాడకుండా ఉండడు తారక్. సోషల్ మీడియాలోనూ తన కొడుకు గురించి స్పందిస్తుంటాడు. అతడి ఫొటోలు పెడుతుంటాడు. తాజాగా తన ముద్దుల కొడుకు మీద తన ప్రేమను మరింతగా చూపించే అవకాశం వచ్చింది ఎన్టీఆర్ కు.

శనివారం అభయ్ పుట్టిన రోజు. కొడుకును వేలు పట్టి నడిపిస్తున్న రీసెంట్ ఫొటో ఒకటి ట్విట్టర్లో షేర్ చేశాడు తారక్. ‘‘నా సంతోషానికి జన్మదిన శుభాకాంక్షలు. అతడికి మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ వరమే. అందరికీ ధన్యవాదాలు’’ అంటూ మెసేజ్ కూడా పెట్టాడు ఎన్టీఆర్. ‘‘నా సంతోషానికి జన్మదిన శుభాకాంక్షలు’’ అన్న ఆ మాట కొడుకు మీద ఎన్టీఆర్ ప్రేమ ఎలాంటిదో తెలియజేస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి అభయ్ మీద శుభాకాంక్షల వర్షం కురుస్తోంది సోషల్ మీడియాలో. చాలామంది సెలబ్రెటీలు కూడా అతడికి విషెస్ చెప్పారు.