శాతకర్ణిపై ఎన్టీఆర్ ప్రశంసలు

0ntr-latest-photoనందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. మొదటిరోజునుంచే బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకెళుతోన్న ఈ సినిమా, అభిమానులు, ప్రేక్షకులనే కాక సినీ, రాజకీయ ప్రముఖులను సైతం మెప్పిస్తోంది. సూపర్ స్టార్ మహేష్‌తో సహా ఎంతో మంది స్టార్స్ ఇప్పటికే గౌతమిపుత్ర శాతకర్ణిపై ప్రశంసల వర్షం కురిపించగా, తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఈ జాబితాలో చేరిపోయారు.

తన బాబాయ్ బాలకృష్ణ నటించిన శాతకర్ణి సినిమాను నిన్న రాత్రి దర్శకుడు క్రిష్‌తో కలిసి చూసిన ఎన్టీఆర్, తన ట్విట్టర్ ఎకౌంట్‌లో సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. శాతకర్ణి ఒక తెలుగు వాడి విజయమని, తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రమిదని ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. విలక్షణ దర్శకుడు క్రిష్ ఎవ్వరికీ పెద్దగా పరిచయం లేని తెలుగు జాతి గర్వించదగ్గ రాజైన శాతకర్ణి జీవిత కథను చెప్పిన ప్రయత్నానికి అద్భుతమైన స్పందన వస్తోంది.