జూనియర్ ఎన్టీఆర్.. రావణాసురన్

0పొరుగు మార్కెట్ల మీద మన హీరోలు బాగానే దృష్టిపెడుతున్నారీ మధ్య. వాళ్ల సినిమాలు బౌండరీలు దాటుకుని వేరే రాష్ట్రాల్లోకి కూడా దూసుకెళ్తున్నాయి. మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఇటీవలే మహేష్ బాబు సినిమా ‘భరత్ అనే నేను’ తమిళనాట భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని త్వరలోనే తమిళ.. మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ చివరి సినిమా ‘జై లవకుశ’ సైతం మరో భాషలోకి అనువాదం కాబోతుండటం విశేషం. ఈ చిత్రాన్ని ‘రావణాసురన్’ పేరుతో మలయాళంలోకి అనువాదం చేస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ పూర్తయింది. త్వరలోనే కేరళలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.

మోహన్ లాల్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ అతడికి కేరళలో మంచి ఫాలోయింగే తెచ్చిపెట్టింది. ఈ చిత్రం అక్కడ ఓ మోస్తరు వసూళ్లు సాధించింది. ఎన్టీఆర్ అనేవాడి గురించి అక్కడి వాళ్లకు బాగానే తెలిసింది. ఈ నేపథ్యంలో ‘జై లవకుశ’ కేరళలో మంచి ఫలితాన్నందుకుంటుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో జై పాత్రలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు. ఈ పాత్రే సినిమాను నిలబెట్టింది. మరి కేరళ జనాలకు ఈ పాత్ర ఏమాత్రం నచ్చుతుందో చూడాలి. బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఎన్టీఆర్ కెరీర్లో ఇది సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. బయ్యర్లకు స్వల్ప నష్టాలు తెచ్చిపెట్టినప్పటికీ కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ మాత్రం ఈ చిత్రంతో భారీగా లాభాలు అందుకున్నారు. మరి కేరళ నుంచి ఈ చిత్రం ఎంత వసూళ్లు రాబడుతుందో చూడాలి.