‘ఎన్టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ : అచ్చం ఎన్టీఆర్‌లానే..

0విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్‌’ సినిమా ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడు. యన్‌.బి.కె. ఫిలింస్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలో బాలకృష్ణ ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. బాలయ్య అచ్చం తన తండ్రి ఎన్టీఆర్‌లా కనిపించారు. కాషాయ రంగు దుస్తుల్లో ఎన్టీఆర్‌లానే మైక్‌ ముందు నిల్చుని మాట్లాడుతూ కనిపించారు. ఆయన వెనుక త్రివర్ణ జెండా ఉంది. ఈ ప్రచార చిత్రం ప్రస్తుతం సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

‘ఎన్టీఆర్‌’ సినిమాలో పలువురు అగ్ర తారలు అతిథి పాత్రల్లో సందడి చేయనున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌గా మోక్షజ్ఞ, నారా భువనేశ్వరిగా మంజిమా మోహన్‌, సావిత్రిగా కీర్తి సురేశ్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రామానాయుడుగా వెంకటేశ్‌, కృష్ణగా మహేశ్‌బాబు.. ఇలా వివిధ పాత్రల్లో పలువురు నటులు సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.