రూమర్ బాగుంది.. ఎన్టీఆర్ వస్తాడా?

0తెలుగు ‘బిగ్ బాస్’ రెండో సీజన్ అంతంతమాత్రంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ స్థానంలోకి వచ్చిన నాని ఓ మోస్తరుగానే షోను నడిపిస్తున్నాడు కానీ.. ఎన్టీఆర్ స్థాయిలో చరిష్మా చూపించట్లేదు. తొలి సీజన్ రేంజిలో జనాల్ని టీవీల ముందు కూర్చోబెట్టట్లేదు. ఇందుకు అతడిని నిందించడానికేమీ లేదు. తన స్థాయిలో నాని బాగానే చేసుకుపోతున్నాడు. తొలి సీజన్లో అంతా కొత్త కావడం వల్ల కూడా జనాల్లో క్యూరియాసిటీ కనిపించింది. ఈసారి కొంచెం మొనాటనీ వచ్చింది. దీనికి తోడు పార్టిసిపెంట్ల వైఫల్యం కూడా ‘బిగ్ బాస్’కు చేటు చేస్తోంది. ఈసారి ఆరంభం నుంచే కుట్రలు.. కుతంత్రాలు.. గ్రూపులతో షో రోతగా తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో షోపై రోజు రోజుకూ నెగెటివిటీ పెరిగిపోతోంది.

ఇలాంటి తరుణంలో ‘బిగ్ బాస్’ను పైకి లేపడానికి మా టీవీ భిన్న ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తొలి సీజన్ హోస్ట్ ఎన్టీఆర్ ఒకసారి షోలో తళుక్కుమంటాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘బిగ్ బాస్’ వల్ల తనకు కూడా ఫాలోయింగ్ పెరిగి.. మంచి పారితోషకం కూడా ముట్టిన నేపథ్యంలో ఎన్టీఆర్ ఈ ప్రపోజల్ పట్ల సానుకూలంగా స్పందించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘బిగ్ బాస్’ ప్రేక్షకులకు నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇవ్వడానికి.. వీక్షకుల్లో ఉత్సాహం పెంచడానికి ఎన్టీఆర్ ను ఒకసారి షోలోకి తీసుకొచ్చి క్యామియో చేయించాలని మాటీవీ భావిస్తోందని.. త్వరలోనే ఎన్టీఆర్ ఈ షోలో కనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదని అంటున్నారు. ఐతే ఈ రూమర్ వినడానికి.. మాట్లాడుకోవడానికి.. ఊహించుకోవడానికి బాగానే ఉంది. కానీ ఎన్టీఆర్ నిజంగా షోలోకి రీఎంట్రీ ఇస్తాడా అన్నది సందేహం.