అమరావతిలో ఎన్టీఆర్ మ్యూజియం

0Sr-NTRతెలుగునాట తన నట వైభవంతోను.. రాజకీయ ప్రాశస్త్యంతోను ఇక్కడి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసినవారు నందమూరి తారకమరావు. ఆయన సినీ జీవిత విశేషాలను, రాజకీయ గమనాన్ని ప్రతిబింబించేలా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఇప్పుడో బృహత్ కార్యాన్ని చేపట్టబోతుంది.

ప్రపంచ అగ్రశ్రేణి మ్యూజియంలకు ఏమాత్రం తీసిపోకుండా.. వీలైతే వాటిని మించి ఉండేలా.. ఎన్టీఆర్ మ్యూజియం, గ్రంథాలయం ఏర్పాటుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సన్నద్దమవుతోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

మ్యూజియం మాత్రమే కాకుండా.. దాన్నో సందర్శన స్థలంగా మార్చాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్రణాళిక‌లు రచిస్తోంది. ఇందుకోసం యూర‌ప్, అమెరికాలోని అంతర్జాతీయ మ్యూజియంల‌తోపాటు, ద‌క్షిణాఫ్రికా మాజీ అధ్య‌క్షుడు నెల్స‌న్ మండేలా మ్యూజియంను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సందర్శించనుంది.

వాటిని అధ్యయనం చేసిన తర్వాత మ్యూజియాన్ని ఎలా తీర్చిదిద్దాలి అన్నదానిపై ఒక అంచనాకు రానున్నారు. మ్యూజియంలో గ్రంథాలయం కూడా ఉండేవిధంగా నిర్మించాలనేది ట్రస్ట్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే మ్యూజియంకు శంకుస్థాప‌న చేసి మూడేళ్ల‌లో పూర్తిచేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.

కనీసం పదెకరాల విస్తీర్ణంలో ఎన్టీఆర్ మ్యూజియం నిర్మించనున్నారు. మ్యూజియంలో ఎన్టీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, సినీ, రాజ‌కీయ రంగాల‌పై ఇందులో ప్ర‌త్యేక గ్యాల‌రీలు ఏర్పాటు చేయనున్నారు.

అలాగే ఎన్టీఆర్ ఫొటోలు, రాతి శిల్పాలు, త్రీడీ బొమ్మ‌లు ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు ద‌క్షిణ భార‌త‌దేశ చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌ను వివ‌రించే పుస్త‌కాలు, ఫొటోలు, వీడియోలు ఇందులో భ‌ద్ర‌ప‌రుస్తారు. క‌నీసం రెండువేల మంది కూర్చునేందుకు వీలుగా ఆడిటోరియం నిర్మించనున్నారు.