అలనాటి మేటి నటి కృష్ణకుమారి కన్నుమూత

0krishna-kumariఅలనాటి మేటి నటి.. రెండు దశాబ్దాలపాటు వెండితెరను ఏలిన కథానాయిక.. బహుభాషానటి కృష్ణకుమారి(84) ఇక లేరు. కొద్దికాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం.. బెంగళూరు శివార్లలోని తన నివాసంలో కన్నుమూశారు. కృష్ణకుమారి కుమార్తె దీపిక, అల్లుడు విక్రమ్‌, మనవడు పవన్‌ బెంగళూరులోనే ఉంటున్నారు. చెల్లెలి మృతిపై షావుకారు జానకి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కాగా, కృష్ణకుమారి అంత్యక్రియలు బుధవారం సాయంత్రం ఆమె ఫామ్‌హౌస్‌లోనే జరిగాయి. కృష్ణకుమారి తండ్రి వెంకోజీరావు ఉద్యోగరీత్యా పశ్చిమబెంగాల్‌లో ఉన్నప్పుడు.. ఆ రాష్ట్రంలోని నైహతిలో 1933 మార్చి 6న జన్మించారు. మెట్రిక్‌ దాకా షిల్లాంగ్‌లో చదివారు. ఇంటర్‌లో చేరే సమయానికి వారి కుటుంబం మద్రాస్‌ చేరుకుంది. అక్కడ ఓసారి ఆమె తన తల్లితో కలిసి ‘స్వప్నసుందరి’ సినిమాకు వెళ్తే.. తమిళనాడు టాకీస్‌ సౌందర్‌రాజన్‌ కుమార్తె భూమాదేవి చూశారు. మర్నాడు వారింటికి వెళ్లి తాము తీసే సినిమాలో కృష్ణకుమారికి హీరోయిన్‌ ఆఫర్‌ ఇచ్చారు. ఆ సినిమా.. నవ్వితే నవరత్నాలు(1951). ఆ తర్వాత ఆమె నటించిన కొన్ని చిత్రాలు విఫలమైనప్పటికీ.. క్రమంగా విజయాలబాట పట్టి సూపర్‌స్టార్‌ రేంజ్‌కి ఎదిగారు. ‘సెట్‌లోకి ఆమె వస్తే మహారాణి వచ్చినట్లు అంతా ఫీలయ్యేవాళ్లం’ అని ప్రముఖ నటి శ్రీదేవి చెప్పడం ఆమె పొందిన స్టార్‌ స్టేట్‌సకు ఓ ఉదాహరణ. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కాంతారావు వంటి అగ్రహీరోలతో.. బందిపోటు, అగ్గిపిడుగు, లక్షాధికారి, ఇలవేల్పు, కులగోత్రాలు, అంతస్తులు, దేవాంతకుడు, వినాయకచవితి, ఆనందనిలయం ఇలా 110చిత్రాల దాకా చేశారు.

తమిళం, కన్నడంలో దాదాపు 15సినిమాలు చేశారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ మాజీ సంపాదకుడు అజయ్‌ మోహన్‌ ఖైతాన్‌ను 1969లో వివాహం చేసుకున్నారు. 2003లో దాసరి తీసిన ‘ఫూల్స్‌’ ఆమె చివరిచిత్రం. కృష్ణకుమారి మృతిపట్ల తెలుగు, తమిళ, కన్నడ సినీప్రముఖులు తీవ్రదిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నటుడు నందమూరి బాలకృష్ణ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఆరోగ్యశాఖ మంత్రి రమేశ్‌కుమార్‌, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు కృష్ణకుమారి మృతి పట్ల సంతాపం తెలిపారు.