పాత ఐఫోన్‌ బ్యాటరీలు పనిచేయడం లేదు

0apple-battteryపాత ఐఫోన్‌ బ్యాటరీలు సరిగా పనిచేయడం లేదని వస్తున్న వార్తలపై యాపిల్‌ సంస్థ ఎట్టకేలకు స్పందించింది. వినియోగదారుల అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. అంతేగాక.. వాటి స్థానంలో కొత్త బ్యాటరీలకు డిస్కౌంట్లు ఇస్తామని ప్రకటించింది. బ్యాటరీ సమస్యలపై ఐఫోన్‌ యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యాపిల్‌ ఈ ప్రకటన చేసింది.

ఐఫోన్‌ 6 సహా కొన్ని మోడళ్లలో బ్యాటరీలు సరిగా పనిచేయడం లేదని, మాటిమాటికీ స్విచ్ఛాఫ్‌ అవుతున్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి.దీంతో యాపిల్‌ వివాదాల్లో చిక్కుకుంది. కొన్ని దేశాల్లో అయితే కొందరు యూజర్లు సంస్థపై దావా కూడా వేశారు. ఈ నేపథ్యంలో యాపిల్‌ స్పందించింది. ఉద్దేశపూర్వకంగా తాము తమ ఉత్పత్తుల నాణ్యతను తగ్గించబోమని పేర్కొంది.

‘బ్యాటరీలు వినియోగ పరికరాలు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వాటి పనితీరు తగ్గిపోతుంది. యాపిల్‌ ఎప్పుడూ ఉద్దేశపూర్వకంగా తమ కస్టమర్లకు ఇబ్బందులు తలపెట్టదు. అలా జరిగిందని మీరు భావిస్తే.. అందుకు క్షమాపణలు చెబుతున్నాం. యూజర్లు మా ఐఫోన్లను వీలైనంత ఎక్కువ కాలం వినియోగించుకోవాలనే మేం కోరుకుంటాం. యాపిల్‌ ఉత్పత్తులు ఎక్కువ రోజులు మన్నుతాయని చెప్పేందుకు మేం గర్విస్తున్నాం. అయితే ఇటీవల కొన్ని బ్యాటరీల్లో సమస్యలు వచ్చాయని విన్నాం. వాటి స్థానంలో కొత్తవి తీసుకునేందుకు డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాం’ అని యాపిల్‌ వెల్లడించింది.

వారెంటీ పూర్తయిన బ్యాటరీ స్థానంలో కొత్త బ్యాటరీని తీసుకునేందుకు ధరను 79 డాలర్ల నుంచి 29 డాలర్లకు తగ్గిస్తున్నట్లు యాపిల్‌ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి చివరి వారం నుంచి డిసెంబర్‌ 2018 వరకు ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ కొనసాగుతుందని పేర్కొంది.