నయనతార గుట్టు బయటపెట్టేసింది

0Nayanthara-Kollywoodనయనతార గురించి ప్రతిదీ రహస్యమే. మిగతా హీరోయిన్ల లాగా నయన్ పబ్లిక్ లో కనిపించడం తక్కువ. అలాగే సినిమా ప్రమోషన్లలో పాల్గొనదు. మీడియాతో మాట్లాడదు. ఇంటర్వ్యూలు ఇవ్వదు. తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటానికి కూడా నయన్ ఇష్టపడదు. దీంతో తన గురించి జనాలకు తెలిసిన సమాచారం చాలా తక్కువ. తన అభిరుచులు.. హాబీల గురించి మీడియాలో ఎప్పుడూ సమాచారం రాలేదు.

ఐతే తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్న నయన్ తన గురించి కొత్త సంగతులు తెలిపింది. నయన్ కు కవితలు రాయడం అంటే చాలా ఇష్టమట. చిన్నప్పట్నుంచి తనకు ఈ హాబీ ఉందని.. ఇప్పటికే చాలా కవితలు రాశానని.. వివిధ అంశాలపై తాను పొయెట్రీ రాస్తుంటానని నయన్ వెల్లడించింది. తనకు ఎప్పుడు ఖాళీ దొరికినా.. పెన్నూ పేపరు పట్టి కవితలు రాయడం మొదలుపెడతానని ఆమె చెప్పింది. అలాగే తాను కొత్త వంటలు చేయడం కూడా ప్రయత్నిస్తుంటానని నయన్ వెల్లడించింది.

సినిమాల్లో నటించడమే తప్ప.. ప్రమోషన్లకు వెళ్లడం అలవాటు లేని నయన్.. ఆశ్చర్యకరంగా ‘ఆరమ్’ అనే సినిమాను ప్రమోట్ చేస్తోంది. రైతుల నీటి సమస్యపై పోరాడే ఓ బ్యూరోక్రాట్ పాత్రను చేస్తోంది నయన్ ఇందులో. ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం నయనకు ప్రత్యేకంగా రూ.40 లక్షల దాకా పారితోషకం ఇచ్చారట. దీంతో ఆమె టీవీ షోలకు వెళ్తూ.. మీడియా వాళ్లను కలుస్తూ సినిమాను ప్రమోట్ చేస్తోంది.