పద్మశ్రీ దక్కించుకున్న సామాన్యులు

0Padma-shree-awards-to-ramaiకేంద్రం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో ఇద్దరి పేర్లు విశేషంగా ఆకర్షించాయి. వారే తెలంగాణ రాష్ట్రానికి చెందిన సామాన్య వ్యక్తులు చింతకింది మల్లేశం, వనజీవి రామయ్య. ఎలాంటి రికమండేషన్ల జోలికి పోకుండా.. సమాజానికి నిస్వార్థ సేవలు చేసిన వారికే ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించడంతో వారికి పద్మ శ్రీ పురస్కారాలు దక్కాయి.

యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలోని శారాజీపేట గ్రామానికి చెందిన చింతకింది మల్లేశం నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన వ్యక్తి. చీర నేయడం కోసం తన తల్లిపడే కష్టం చూడలేక.. మల్లేశం ఓ ఆసు యంత్రాన్ని రూపొందించారు. తక్కువ సామర్థ్యం ఉండే రెండు మోటార్లు, ఓ చెక్క ఫ్రేమ్‌తో ఆయన రూపొందించిన ఆసు యంత్రం కారణంగా చీర నేత చాలా తేలికైంది. ఈ యంత్రానికి తన తల్లి పేరిటే లక్ష్మీ ఆసు యంత్రం అనే పేరు పెట్టారు. 2000 సంవత్సరంలో ఈ మెషిన్ కనిపెట్టిన మల్లేశం.. తర్వాత దాన్ని మరింత అభివృద్ధి చేశారు. ఇప్పటికే ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్తగానూ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అదుకున్నారు. ఈ మెషీన్‌పై మల్లేశానికి పేటెంట్ హక్కులు కూడా ఉన్నాయి. పోచంపల్లి టై ఆండ్ డై చేనేత వస్త్రాల ఆటోమెటిక్ డిజైన్ మార్కింగ్ మెషీన్‌ను రూపొందించే పనుల్లో ఉన్నారీయన.

ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య అసలు పేరు దరిపెల్లి రామయ్య. కానీ భారీగా మొక్కలను పెంచడం వల్ల ఆయన వనజీవి రామయ్యగా ప్రసిద్ధి చెందారు. ఇప్పటి వరకూ ఆయన కోటికిపైగానే మొక్కలు నాటారంటే ఆశ్చర్యం కలగక మానదు. వేసవిలో అడవుల్లోకి వెళ్లి.. విత్తనాలను సేకరించి వాటిని నిల్వచేస్తారు. తొలకరి సమయంలో ఆ విత్తనాలను ఖాళీ ప్రదేశాలు, రోడ్లకు ఇరువైపులా చల్లుతుంటారు. ఇలా గత 55 ఏళ్లుగా ఆయనకు అదే పని. ఇన్నేళ్ల ఆయన కృషి ఫలితంగా.. అవి పెరిగి భారీ వృక్షాలయ్యాయి. వృక్షోరక్షతి.. రక్షితః అని రాసిన ఓ అట్ట ముక్కను తన వెంట ఉంచుకొని మొక్కలను పెంచాల్సిన ఆవశ్యకతను నలుగురికీ అన్యోపదేశంగానే చెబుతుంటారు. మనవరాళ్లకు కూడా మొక్కల పేర్లే పెట్టాడంటే ఆయనకు ఆయనకు మొక్కలపై ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. ఖమ్మం సమీపంలోని రెడ్డిపల్లె నుంచి మహబూబాబాద్ వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లన్నీ రామయ్య నాటినవే కావడం విశేషం.