దర్శకుడిని చంపితే తక్షణమే రూ.51లక్షలు

0Sanjay-Leela-Bhansali-Padmaసంజయ్‌ లీలా భన్సాలీ వివాదాస్పద చిత్రం ‘పద్మావత్‌’ పై తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. చిత్ర దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తలకు భారీ నజరానా ఇస్తామంటూ మరో గ్రూపు ప్రకటించింది. భన్సాలీ తల నరికిన వారికి రూ.51 లక్షల పారితోషికం ఇస్తామని ఆల్‌ ఇండియా బ్రజ్‌మండల్‌ క్షత్రియ రాజ్‌పుత్‌ మహాసభ ప్రకటించింది.

భన్సాలీని హత్య చేస్తే తక్షణమే ప్రకటించిన బహుమతి అందిస్తామని బ్రజ్‌మండల్‌ క్షత్రియ రాజ్‌పుత్‌ మహాసభ ఉపాధ్యక్షుడు దివాకర్ సింగ్ వెల్లడించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ఆందోళనకు మద్దతు ఇవ్వకుండా ఈ సమస్యపై మౌనంగా ఉన్న రాజకీయవేత్తలకు తగిన గుణపాఠం చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్గావ్‌ స్కూలు పిల్లలపై దాడిగురించి ప్రశ్నించినపుడు ఆందోళనను పక్కదారి పట్టించేందుకు సినీ పరిశ్రమ అల్లిన కథ ఇది అని మండిపడ్డారు. రాజపుత్‌లు నిరాయుధులు, మహిళలు, పిల్లలపై ఎప్పటికీ దాడిచేయరని వివరణ ఇచ్చారు.

కాగా అయితే చారిత్రాత్మక చిత్రం పద్మావత్‌ విషయంలో ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పద్మావతి పాత్రలో నటించిన దీపికా పదుకొనెను చంపేస్తామన్న బెదిరింపులొచ్చాయి. దీపికా ముక్కు చెవులు కోస్తే కోటి రూపాయలు ఇస్తామనీ, దీపికాను చంపితే రూ.5 కోట్లు ఇస్తామని కూడా క‌ర్ణిసేన‌ సంస్థ ప్రకటించింది. పద్మావత్‌ చిత్రం విడుదలను అడ్డుకుంటామని , థియేటర్స్లో సినిమా ఆడితే తగలబెట్టేస్తామంటూ కర్ణిసేన హెచ్చరించింది. రాజ్‌పుత్‌లను చెడ్డగా చిత్రీకరించిందని, చారిత్రక వాస్తవాలను వక్రీకరించారంటూ మండిపడుతూ ఆందోళనకు దిగింది. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి యు/ఏ సర్టిఫికేట్ పొందిన తరువాత, జనవరి 25న విడుదలైన గత రెండు రోజుల్లో ర్యాలీలు, విధ్వంసం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.