పేపర్ బాయ్.. ఒక సింపుల్ లవ్ స్టోరీ

0టాలీవుడ్ లో వర్షం సినిమాను ఎవ్వరు మర్చిపోలేరు. దర్శకుడు శోభన్ కి ఆ సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది. త్రివిక్రమ్ కి మంచి మిత్రుడు అయిన ఆయన 2008లోనే మరణించారు. అయితే ఆయన కుమారుడు సంతోష్ శోభన్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకుముందే అతను తను నేను సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఇప్పుడు పేపర్ బాయ్ అంటూ సింపుల్ లవ్ స్టోరీతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. కాన్సెప్ట్ పరంగా సినిమా బావుంటుందని టాక్ వస్తోంది. యూనిక్ స్టోరీ అని తెలుస్తోంది. ఎక్కువగా యూత్ ని ఆకట్టుకునే విధంగా సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాను దర్శకుడు సంపత్ నంది నిర్మిస్తున్నాడు. ఇంతకుముందు సంపత్ నంది క్రియేటివ్ వర్క్స్ పై గాలిపటం అనే సినిమాను నిర్మించాడు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఇప్పుడు పేపర్ బాయ్ కాన్సెప్ట్ ను నమ్మి సంపత్ సినిమాను నిర్మిస్తున్నాడు. తనే సొంతంగా మాటలు – స్క్రీన్ ప్లే అందించుకున్న ఈ సినిమాకు జయ శంకర్ ను దర్శకుడిగా సెట్ చేసుకున్నాడు.

ఇప్పటికే సగం సినిమా షూటింగ్ ను పూర్తి చేశారట. త్వరలోనే రెగ్యులర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అసలే ఈ మధ్య కాలంలో క్యూట్ లవ్ స్టోరీలైన ఛలో.. తొలిప్రేమ వంటి సినిమాలు బాగా హిట్టవ్వడంతో.. పేపర్ బాయ్ కూడా ఆ కోవలోనే ఇంప్రెస్ చేస్తుందేమోనని ఫిలిం నగర్లో అంచనాలు వినిపిస్తున్నాయి.