ట్రైలర్ టాక్: అందమైన పేపర్ ప్రేమ

0ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ కి మంచి ఆదరణ దక్కుతున్న సీజన్ లో ఆ కోవలో వస్తున్న మరో మూవీ పేపర్ బాయ్. మాస్ సినిమాల దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా జయ శంకర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తీసిన పేపర్ బాయ్ ట్రైలర్ ఇందాకా విడుదల చేసారు. కథ చాలా సింపుల్ గా ఏముందో చెప్పసారు. పేపర్లు వేస్తూ బ్రతుకు తెరువు చూసుకుంటున్న విద్యావంతుడైన హీరోకు ధనవంతుల కుటుంబానికి చెందిన ఓ అందమైన మనసున్న అమ్మాయితో పరిచయం ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలో ఎన్నో అడ్డంకులు సవాళ్లు ఎదురవుతాయి. తన ప్రేమ కోసం ఆ హీరో కఠినమైన పరీక్షను ఎదురుకోవాల్సి వస్తుంది. తన ప్రేయసిని తానే దూరం చేసుకునే దాకా విధి ప్రేరేపిస్తుంది. తన ప్రేమను అక్షరాల రూపంలో నిక్షిప్తం చేసే ప్రయత్నం చేస్తాడు హీరో. మరి ఇతని గమ్యం ఏంటి దాన్ని అందుకున్నాడా లేదా అనేదే పేపర్ బాయ్.

ట్రైలర్ చాలా కూల్ గా ప్లెజెంట్ గా ఉంది. ఎక్కువ హంగామా లేకుండా సున్నితమైన భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తూ హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ను చాలా అందంగా చిత్రీకరించినట్టు కనిపిస్తున్న ఈ మూవీలో సౌందర్ రాజన్ కెమెరా అద్భుతమైన విజువల్స్ చూపిస్తోంది. లిప్ కిస్ కు నిర్వచనం ఇప్పించడం ద్వారా హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేసిన తీరు కూడా బాగుంది. హీరో సంతోష్ శోభన్ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తుండగా హీరోయిన్ రియా సుమన్ సింపుల్ గా ఉంది. తాన్యా హోప్ కూడా మరో హీరోయిన్ గా నటించింది. మొత్తానికి పేపర్ బాయ్ ప్రేమ అనే సున్నితమైన అంశాన్ని బాగానే డీల్ చేసినట్టు కనిపిస్తోంది. సెప్టెంబర్ 7న విడుదల కానున్న పేపర్ బాయ్ కు భీమ్స్ అందించిన సంగీతం కూడా ప్లస్ గా మారింది. మంచి ఫీల్ ఉన్న మ్యూజిక్ ని అందించాడు.