బట్టలు విప్పే ప్రేమ మా సినిమాలో ఉండదు!

0సినిమా సక్సెస్ కి సంబందించిన ట్రెండ్ ఒక పట్టాన అర్థం కాదు. దాన్ని ఒడిసిపట్టుకునే తీరు మహామహులకే అర్థం కాలేదు. అందుకే ఏ సినిమా ఆడుతుందో ఏది పోతుందో చెప్పడం బ్రహ్మ తరం కూడా కాదన్న ఓ పరిశ్రమ పెద్ద మాట ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. దానికి తోడు సినిమాలో కంటెంట్ ని వీలైనంత హై లైట్ చేసి వసూళ్లు రాబట్టుకునే ప్రయత్నం చేయటం ఈ మధ్య కాలం లో సహజంగా చూస్తున్నదే. దేని ధోరణి దానిదే అన్న తరహాలో ఊహించని విధంగా బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలకు వసూళ్లు బాగా వస్తున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకునే పరిచయం సినిమా ద్వారా టాలీవుడ్ లో దర్శకుడిగా పరిచయం కాబోతున్న లక్ష్మికాంత్ ఆ మూవీ ప్రమోషన్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నిజమైన ప్రేమను అనుభవించిన వాళ్ళు ప్రేమంటే తెలిసిన వాళ్ళు మాత్రమే మా సినిమాకు రండి అని అతను చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.

ప్రేమకు అర్థం తెలిసిన ఆడియన్స్ మాత్రమే పరిచయం సినిమాకు రావాలంటున్న లక్ష్మికాంత్ బీచుల్లో తిరగడం కూల్ డ్రింక్స్ తాగటం బట్టలు విప్పుకు చూపించడం లాంటివి ప్రేమ అనుకుంటే వాళ్లకు ఇది నచ్చదని కామెంట్ చేయటం విశేషం. ఇది ఇటీవలే చిన్న బడ్జెట్ తో రూపొంది బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న సినిమా గురించి ఇన్ డైరెక్ట్ గా వేసిన కౌంటర్ గా అనిపించడం సహజం. ఇది కూడా కొత్త హీరో విరాట్ తో సిమ్రత్ కౌర్ జంటగా రూపొందిన చిత్రం. ఇలా పేరు ప్రస్తావించకుండా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడుతున్న సినిమా గురించి ఒక కొత్త సినిమా దర్శకుడు పరోక్షంగా విసుర్లు వేయటం అక్కడున్న వారిని సైతం ఆశ్చర్యపరిచింది. జులై 21న విడుదల కాబోతున్న పరిచయంలో ప్రేమతో పాటు తల్లితండ్రులు బిడ్డలా మధ్య అనుబంధాల గురించి కూడా హృదయాన్ని హత్తుకుపోయేలా చూపింఛాయానన్న లక్ష్మికాంత్ ఇలా ప్రేమ గురించి తెలిస్తేనే సినిమా రమ్మని చెప్పడం కొత్త తరహా పబ్లిసిటీ ఏమో. తాజాగా హిట్ కొట్టిన మరో డెబ్యూ డైరెక్టర్ సైతం రొటీన్ సినిమాలు చూసేవాళ్లకు నా సినిమాకు రాకండి అని చెప్పడం బాగా వర్క్ అవుట్ అయ్యింది. మరి పరిచయం అదే దారిలో వెళ్తుందా లేదా కొత్త ట్రెండ్ కు దారి చూపుతుందా 21న తేలిపోతుంది.