పవన్-త్రివిక్రమ్ కూడా ఆమెకే ఓటేశారు

0Megha-Akashమేఘా ఆకాశ్.. ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశం అవుతున్న పేరు. తెలుగులో నటించిన తొలి సినిమా విడుదల కాకముందే ఈ అమ్మాయి.. మరో రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్స్ పట్టేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ మలయాళ భామ తమిళంలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘యెన్నై నొక్కి పాయుమ్ తోటా’ అనే సినిమాలో కథానాయికగా నటించింది. ఆ సినిమా విడుదల కాకముందే తన అందం.. టాలెంట్ గుర్తించి తెలుగులో నితిన్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘లై’ సినిమాకు కథానాయికగా ఎంచుకున్నారు. ఆ చిత్ర యూనిట్ నుంచి ఈ అమ్మాయి గురించి మంచి ఫీడ్ బ్యాక్ రావడంతో రామ్-కిషోర్ తిరుమల కాంబినేషన్లో మొదలైన కొత్త సినిమాకు తననే కథానాయికగా తీసుకున్నారు.

ఇప్పుడు మేఘా ఆకాశ్ మరో బంపర్ ఆఫర్ పట్టేసినట్లుగా వార్తలొస్తున్నాయి. నితిన్ సరసన ఆమె మరో సినిమాలో నటించబోతోందట. అది పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ నిర్మాణలో తెరకెక్కబోయే సినిమా కావడం విశేషం. లిరిసిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ కృష్ణచైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశం పట్టేసిన మేఘా టాలీవుడ్లో నెక్స్ట్ స్టార్ హీరోయిన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్రివిక్రమ్ పవన్ తో చేస్తున్న సినిమా నుంచి బ్రేక్ తీసుకుని మరీ ఈ సినిమా మీద దృష్టిపెట్టాడు. హీరోయిన్ని ఫైనలైజ్ చేసి.. మిగతా కార్యక్రమాలు కూడా అవగొట్టే పనిలో ఉన్నాడు. జులైలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందట. ఈ ఏడాది చివరికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చని సమాచారం.