పవన్ సినిమా వేడుకలకు రాడు కానీ..

0Pawan-Stop-Caring-About-his-familyపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ సినిమాల వేడుకలకు రావాలని మెగా ఫ్యామిలీ హీరోలందరూ కోరుకుంటారు. కానీ పవన్ ఆ వేడుకలకు రావడానికి అంతగా ఇష్టపడడు. చివరికి చిరంజీవి సైతం పవన్ రాక కోసం ఎదురు చూసి నిరాశ చెందిన వాడే. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా కొన్ని కార్యక్రమాలకు హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాడు పవన్. తాజాగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఒక సెలూన్ ఆరంభోత్సవానికి పవన్ హాజరవడం విశేషం. పవన్ కు ‘గోపాల గోపాల’ సినిమా దగ్గర్నుంచి హెయిర్ స్టైలిస్టుగా పని చేస్తున్న రామ్ కొనికి అనే కుర్రాడు ‘సెలూన్ కొనికి’ పేరుతో ఒక సెలూన్ ఓపెన్ చేశాడు.

ఈ సెలూన్ ప్రారంభోత్సవానికి రావాలని రామ్ పవన్ ను కోరగా.. మరో ఆలోచన లేకుండా అంగీకరించాడు. తన చేతుల మీదుగా సెలూన్ ను ప్రారంభించాడు. ఇక ఆ హెయిర్ స్టైలిస్ట్ ఆనందానికి అవధులే లేవు. ఓవైపు త్రివిక్రమ్ సినిమా కోసం విరామం లేకుండా రోజుకు 12 గంటలు పని చేస్తూనే.. రామ్ కోసం తీరిక చేసుకుని ఈ వేడుకకు హాజరయ్యాడు పవన్. కానీ మెగా హీరోల సినిమాల వేడుకలంటే మాత్రం ఖాళీ ఉన్నా హాజరు కాడు పవన్. మెగా హీరోలనే కాదు.. వేరే సినిమాల వేడుకలకు కూడా పవన్ హాజరవడం అరుదే. అలాంటిది తనకు హెయిర్ స్టైలిస్టుగా పని చేసే కుర్రాడి సెలూన్ను పవన్ ప్రారంభించడం ఆశ్చర్యకరమైన విషయమే.