పరిటాల సునీత ఇంట్లో పవన్ కళ్యాణ్

0pawan-kalyan-in-paritala-suఅభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే వారి వెంటే నడుస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, అందులో అనంతపురానికి ఎక్కువ మొత్తం కేటాయించి ఆదుకోవాలని కోరారు. అనంతపురం పర్యటనలో భాగంగా ఆదివారం కదిరికి వచ్చిన ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. అనంతలో వర్షాభావం, బోర్లు ఎండటం వంటి ప్రతికూల పరిస్థితుల్లో గల్ఫ్ దేశాలకు మహిళలు ఉపాధికి వలస వెళ్లారని, ఏజెంట్ల చేతిలో మోసపోయి పలువురు వెట్టిచాకిరీ చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను దుబాయ్‌ వెళ్లినప్పుడు ఎంతోమంది గోడు వెళ్లబోసుకున్నారని వివరించారు. గల్ఫ్‌ బాధితులకు తెలంగాణలో ఉపాధి అవకాశాలు కల్పించినట్లే ఏపీలోనూ కల్పించాలని కోరారు. మద్దతు ధరలు లేక రైతు ఆత్మహత్యలతో కుటుంబాలు చిన్నాభిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని, బలవన్మరణంతో భర్తలను కోల్పోయిన రైతు కుటుంబాల్లోని మహిళలకు పింఛను ఇచ్చేలా అధికారులతో చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని తెలిపారు. దళారీ వ్యవస్థను మార్చలేమని, వారితో పోటీపడలేమని, రైతులకు గిట్టుబాటు ధర దక్కాలంటే ఉత్పత్తుల నిల్వకు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వానికి నివేదిస్తానని పేర్కొన్నారు. కరవును రూపుమాపేందుకు అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. దశాబ్దాలుగా తనపై అభిమానం చూపిన ప్రజలకు మద్దతుగా ఎందుకు నిలవకూడదనే భావనతోనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఎలాంటి సంస్థలు వెనుక లేకుండా వ్యక్తులుగా జిల్లాకు చెందిన నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, భగవాన్‌ సత్యసాయి వంటివారు ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. అన్నా హజారే ఒక్కరే అయినా.. పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చారని తెలిపారు. తాను చేపట్టిన అనంత కరవుపై పోరాటానికి యువత, ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. అధ్యయన నివేదికలతో సమస్యల

పరిష్కారానికి కేంద్రం వద్దకు వెళ్తానన్నారు.

మంత్రి సునీతతో భేటీ: ఆదివారం ఉదయం పవన్‌ కల్యాణ్‌ అనంతపురంలో మంత్రి పరిటాల సునీతను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల వివరాల గురించి మంత్రిని, ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు పురోగతిని పవన్‌ ప్రత్యేకంగా తెలుసుకున్నారు. అనంత అభివృద్ధికి సహకారం అందించేందుకు పవన్‌ ముందుకు రావడం సంతోషకరమని మంత్రి సునీత వ్యాఖ్యానించారు. సాయంత్రం కదిరి లక్ష్మీ నరసింహస్వామిని పవన్‌ దర్శించుకున్నారు. కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషాను కలిసి ఆ ప్రాంత సమస్యలు తెలుసుకున్నారు. రాత్రికి పుట్టపర్తి చేరుకున్న పవన్‌ స్థానికంగా ప్రసంగిస్తూ సత్యసాయి స్ఫూర్తితో జనసేనను నడిపిస్తామని చెప్పారు.

అభిమానికి గాయాలు: పవన్‌ కదిరి నుంచి పుట్టపర్తికి వెళ్తుండగా నల్లమాడ క్రాస్‌వద్ద యువకులు పెద్ద ఎత్తున తమ అభిమాన నటుడితో చేయి కలపాలనే తపనతో ఒక్కసారిగా ముందుకొచ్చారు. దీంతో నల్లమాడకు చెందిన మహేష్‌ (23) కిందపడగా.. అతనిపై నుంచి కారు వెళ్లడంతో కాలు విరిగింది. స్నేహితులు గుర్తించి పక్కకు లాగారు. వెనకాలే వస్తున్న మరో వాహనంలో పుట్టపర్తి ఆసుపత్రికి తరలించారు.