సంగారెడ్డిలో పవన్ జనసేన సభ

0Pawan-kalyan-meeting-in-sanజిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో త్వరలో సభను నిర్వహిస్తామని సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ ప్రకటించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. జనసేన పార్టీ మూడో వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం మీడియా సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో తొలిసారిగా నిర్వహించే సమావేశానికి సంగారెడ్డిని ఎంపిక చేసుకోవడం వెనుక వ్యూహమేంటనే అంశంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.

గతంలో తన ప్రసంగాల్లో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరును ప్రస్తావించిన పవన్‌ కళ్యాణ్‌ ఆ తర్వాత పలు సందర్భాల్లో ఇరువురు భేటీ అవుతూ వస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో సంగారెడ్డి శివారులో జరిగిన ఓ సినిమా షూటింగ్‌ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌తో జగ్గారెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే పవన్‌ కల్యాణ్‌తో జరిగిన భేటీలో చర్చించిన అంశాలను వెల్లడించేందుకు జగ్గారెడ్డి అప్పట్లో నిరాకరించారు. అయితే సందర్భం వచ్చినపుడు మా త్రమే వివరాలు వెల్లడిస్తానని ప్రకటించారు.

ప్రస్తుతం జనసేన పార్టీ సభ నిర్వహణకు సంగారెడ్డిని వేదికగా ఎంపిక చేసుకోవడం వెనుక జగ్గారెడ్డితో ఉన్న సాన్నిహిత్యమే కారణమనే వాదన వినిపిస్తోంది. ఏర్పాట్లు, జనసమీకరణ మొదలుకుని అన్ని అంశాల్లోనూ మాజీ ఎమ్మెల్యే మద్దతు లభిస్తుందనే కోణంలోనే సం గారెడ్డి జిల్లా కేంద్రాన్ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల సంగారెడ్డి శివా రు ఇస్మాయిల్‌ఖాన్‌పేటలోని ఓ దేవాలయంలో జరిగిన సినిమా షూటింగ్‌ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ను చూసేందుకు యువత పెద్ద ఎత్తున ఆసక్తి చూపించారు. ఇదిలా వుంటే వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌.. సంగారెడ్డిని వ్యూహాత్మకంగా ఎంపిక చేశారని తెలుస్తోంది.