కన్నడ ఎన్నికల్లో వాళ్లకు హ్యాండ్ ఇచ్చిన పవన్

0దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న కన్నడ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల హీటు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఓవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాంగ్రెస్ రథసారథి రాహుల్గాంధీ ఆ రాష్ట్రంలో చుట్టేస్తూ వేడిని పుట్టిస్తుండగా.. ఇదే సమయంలో ఆ రాష్ట్రంలోని పాతుకుపోయిన జేడీఎస్ సైతం ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. అయితే కన్నడ వేడిలోకి తెలుగు ప్రముఖ నటుల ఎంట్రీ కూడా మొదలు కానుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఈ రాష్ట్ర ఎన్నికల పోరులో భాగస్వామ్యం పంచుకోనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇదేమీ లేదని పవన్ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. తద్వారా తనను నమ్ముకున్న జేడీఎస్ కు పవన్ మొండిచేయి చూపినట్లేనని విశ్లేషిస్తున్నారు.

కర్ణాటకకు సంబంధించి తనతో సఖ్యతగా ఉండే జేడీఎస్ కోసం ప్రచారానికి వస్తానని గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఎందుకంటే పవన్ ప్రచారం అక్కడి తెలుగు ఓట్లను జేడీఎస్ కు పడేలా చేస్తుంది కాబట్టి. కర్ణాటక ఆంధ్రా సరిహద్దు జిల్లాలైన బళ్లారి – గుల్బర్గా – బీదర్ తదితర ప్రాంతాల్లో జయాపజయాలను నిర్ణయించగలిగే స్థాయిలో తెలుగు ఓటర్లు ఉన్నారు. మరోవైపు బెంగళూరులోనూ పెద్ద సంఖ్యలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు తెలుగువారే. దీంతో వారిని ఆక్టుటకునేందుకు పవన్ టూర్ పెట్టుకుంటారని ఆయన జేడీఎస్ తరఫున ప్రచారం చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే పవన్ కర్ణాటక టూర్ లేనట్లే అని తాజాగా రుజువు అయింది. జనతాదళ్ (ఎస్) కుమారస్వామి బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ పవన్ ప్రచారంపై క్లారిటీ ఇవ్వలేకపోయారు. దీంతో ఆయన ప్రచారంపై ఇప్పటి వరకు సాగిన ఊహాగానాలకు తెరపడింది.

పవన్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి సమ్మర్ టూర్ విదేశాలకు వెళ్ళాడు. 10వ తేదీన పవన్ తిరిగి హైదరాబాద్ వస్తాడు. అదే రోజు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నెల 10న హైదరాబాద్ లో ఈ సక్సెస్ మీట్ జరగనుంది.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 12న జరగనున్నందున ప్రచారం 10వ తేదీతోనే ముగుస్తుంది. ఎన్నికల ప్రచారం కూడా 10వ తేదీతోనే ముగుస్తుండటంతో.. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి పవన్ డుమ్మాకొట్టే అవకాశాలే ఉన్నాయని చెప్తున్నారు. అదే సమయంలో పవన్ క్యాంప్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో కన్నడ నేలపై జనసేనాని ప్రచారం ఉండదని స్పష్టం చేస్తున్నారు.