హోదాపై మరో సారి స్పందించిన పవన్

0Pawan-in-press-meetప్రత్యేక హోదా ఒక గతించిన అంశం అని ఏపీ అధికార పార్టీ టీడీపీ ఎన్నడో తీర్మానించేసిన సంగతి తెలిసిందే. దీని గురించి ప్రతిపక్షం ప్రశ్నించినప్పుడల్లా.. కేంద్రంతో గొడవలు పెట్టుకోమంటారా? అది రాష్ట్రానికి అంత మంచిది కాదు! అంటూ టీడీపీ ‘హోదా’ అంశాన్ని దాటవేస్తూ వస్తోంది.

ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం హోదాపై టీడీపీ ఎంపీలను నిలదీయడమే పనిగా పెట్టుకున్నారు తప్పితే.. సీఎం చంద్రబాబు నాయుడుని మాత్రం ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదు. పైగా ఆయన లాంటి అనుభజ్ఞులు రాష్ట్రానికి అవసరమంటూ వేదికల మీదే చెప్పుకొస్తారు. తాజాగా మరోసారి హోదాపై ట్విట్టర్ ద్వారా గర్జించిన పవన్ కళ్యాణ్ యథావిధిగా టీడీపీ ఎంపీల తీరును తప్పుపట్టారు. అదే సమయంలో వైసీపీ ఎంపీలను ఆయన ప్రస్తావించడం విశేషం.

కేంద్రంతో సఖ్యత మెలగాలి, దేనికైనా నిగ్రహంగా వ్యవహరించాలి అన్న దానికి నేను కూడా కట్టుబడి ఉంటాను. కానీ ఇంకెన్నాళ్లు.. కేంద్రంనుంచి రాష్ట్రానికి పదే పదే అన్యాయం ఎదురవుతుంటే.. ఇంకా నిగ్రహంగా ఉండటం ఎంతవరకు సమంజసం అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

దయచేసి మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టవద్దంటూ టీడీపీకి పవన్ మరోసారి హితవు పలికారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ఎంపీలపై ఉత్తరాది ఎంపీలు దాడిని, అవమానాన్ని టీడీపీ ఎంపీలు మరిచిపోయినట్టున్నారని పవన్ మండిపడ్డారు.

హోదాపై కేంద్రమంత్రి అశోకగజపతిరాజు మౌనం వహించడం తనను బాధిస్తోందని పవన్ అన్నారు. హోదా విషయంలో టీడీపీ ఎంపీలు ఎట్టి పరిస్థితుల్లోనే వెనక్కి తగ్గవద్దని సూచించారు. ప్రత్యేక హోదా ఇస్తారన్న నమ్మకంతో రాష్ట్రంలో టీడీపీకి ప్రజలు ఓట్లేశారని గుర్తుచేశారు.

ఎప్పుడూ తన నోట వైసీపీ గురించి ప్రస్తావించని పవన్ కళ్యాణ్.. తొలిసారిగా ఆ పార్టీ ఎంపీలను పొగడటం విశేషం. ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీ ఎంపీలు చేస్తున్న ప్రయత్నాన్ని ఆయన ప్రశంసించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్న పేపర్ క్లిప్పింగ్ ను ట్విట్టర్ లో పోస్టు చేసి.. హోదాపై వైసీపీ ప్రయత్నాన్ని అభినందించారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని విజయ్ సాయిరెడ్డి రాజ్యసభలో డిమాండ్ చేశారు. హోదాకు సమానమైన ప్యాకేజీ అని చెప్పి హోదా కలిగిన రాష్ట్రాల కన్నా తక్కువ నిధులు మంజూరు చేశారని ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం హోదా ఉన్న, హోదా లేని రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీ చేసే విషయంలో వివక్షత ప్రదర్శించలేదన్నారు.

హోదా అంశంపై ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ సమయంలోను విజయసాయిరెడ్డి ప్రస్తావనకు తీసుకొచ్చారు. గతంలో హోదాపై మోడీ ఇచ్చిన హామిని గుర్తుచేశారు.

ఎన్నాళ్లు ఈ నిగ్రహమంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎంపీలను ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్.. ప్రత్యేక హోదా కోసం తనవంతుగా చేసింది మాత్రం ఏమి లేదు. సభలు, సమావేశాలు పెట్టి కావాల్సినంత ఆవేశాన్ని, ఆగ్రహాన్ని వెళ్లగక్కడం తప్ప దీనికి సంబంధించి ఆయనదంటూ ఓ కార్యాచరణ లేకుండా పోయింది. ఆఖరికి ప్రతిపక్షం సహా ప్రజలంతా కలిసి విశాఖ ఆర్కే బీచ్ లో హోదాపై పోరాటానికి దిగితే.. కనీసం దానికి కూడా మద్దతుగా నిలవలేకపోయాడు.

దీంతో పవన్ మాటలు వింటున్నవారు కూడా విసుగెత్తిపోతున్న పరిస్థితి. ప్రతీసారి ట్విట్టర్ ద్వారా తోచింది రాసేసి, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడమే తప్ప, హోదా విషయంలో పవన్ కు అసలు పోరాడాలన్న ఉద్దేశం ఉందా? అన్న అనుమానాలు కూడా కలగకమానవు. కార్యాచరణ లేకుండా కేవలం మాటలకే పరిమితమైపోతే.. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ మరింత తీసికట్టుగా తయారవడం మాత్రం ఖాయం.

ఏపీకి ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో తెలంగాణ తరుపున తమ గొంతు వినిపించిన ఎంపీలు కేశవరావు, రాపోలు ఆనందభాస్కర్ లకు పవన్ అభినందనలు తెలిపారు. గతంలో హోదాపై మద్దతు తెలిపినందుకు ఎంపీ కవితకు సైతం పవన్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే.