అశోక్ గజపతి రాజుకు పవన్ కౌంటర్

0ఉత్తరాది – దక్షిణాది అంశంపై తాను ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట కూడా ఇంతే సీరియస్‌గా చెబుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం అన్నారు. ఆయనను హైదరాబాదులోని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు కలిశారు. తమ సమస్యలను చెప్పుకున్నారు.

జనసేన కార్యాలయానికి వెళ్లిన వీరు తమ సమస్యలు చెప్పుకున్నారు.వారి సమస్యలను పవన్ సానుకూలంగా విన్నారు. ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలు విద్యార్థులను దోచుకుంటున్నాయని ఈ సందర్భంగా విద్యార్థులు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ యత్నించాలని సూచించారు. ప్రశాంతంగా జరిగే ధర్నాలను అడ్డుకోవడం సరికాదని తెలంగాణ సీఎంకు హితవు పలికారు. ధర్నా చౌక్ ఎత్తివేతను నిరసిస్తూ జరిగే ఆందోళనల్లో జనసేన పాల్గొంటుందని చెప్పారు. ధర్నా చౌక్ అంశంపై తమ్మినేని వీరభద్రం తనను కలిశారని చెప్పారు.

ఉత్తరాది, దక్షిణాది అంశంపై కూడా పవన్ స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉత్తరాది వ్యక్తిని నియమించడాన్ని పవన్ ప్రశ్నించారు. దీనిపై పలువురు కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు.

తాను ఉత్తరాది వారికి, హిందీకి ఏమాత్రం వ్యతిరేకం కాదని పవన్ చెప్పారు. కానీ దక్షిణాది వారిని సెకండ్ క్లాస్ సిటిజన్స్‌గా చూడవద్దని చెబుతున్నానని చెప్పారు. ఉత్తరాది వారికి దక్షిణాదిన పదవులు ఇస్తున్నారని, మరి ఉత్తరాదిన ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట అయినా ఇంతే సీరియస్‌గా చెబుతానన్నారు.

అశోక్ గజపతి రాజు మీరెవరో తెలియదన్నారని అడగగా.. పవన్ కళ్యాణ్ కాసేపు నవ్వారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేను ఎవరో ఆయనకు తెలియక పోవచ్చు.. కానీ ఆయన మాత్రం తనకు బాగా తెలుసునని కౌంటర్ ఇచ్చారు.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయడం సరికాదని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే, కేంద్రం కూడా రెండు ప్రాంతాలకు సమ ప్రధాన్యం ఇవ్వనప్పుడు అది దేశ సమగ్రతకే నష్టమన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లడమే జనసేన ఉద్దేశ్యమని చెప్పారు.