ఆరే సాంబ..పవన్ సారుకు అలా రాసిస్తున్నారేంట్రా?

0



సంచలన వ్యాఖ్యలు చేయటం రాజకీయ నాయకులకు అలవాటే. కానీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరహాలో సంచలన వ్యాఖ్యలు చేయటం ఏ రాజకీయ నాయకుడి వల్లా కాదేమో? రాజకీయాల మీద ఓనామాలు దిద్దే వారు సైతం సాధ్యం కాదని చెప్పే అంశాల్ని.. పబ్లిక్ మీటింగ్ లలో చెప్పేయటం.. ఆ తర్వాత మీడియాకు రిలీజ్ చేసే ప్రెస్ నోట్లలోనూ అలాంటి షాకింగ్ కామెంట్లు రాయటం చూస్తే.. ఆరేవో సాంబ.. పవన్ సార్ స్పీచుల్ని రాసేటోళ్ల చేత కాసిన్ని పేపర్లు రోజూ చదివించండ్రా అనాలనిపించక మానదు.

పవన్ చేస్తున్న తాజా బస్సు యాత్ర కమ్ పోరాట యాత్ర ప్రస్తుతం అముదాలవలసకు చేరుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ ఊహించిన రీతిలో కామెంట్లు చేసి షాకిచ్చారు. ఏపీ అధికారపక్షం జత కట్టబోతోన్న పార్టీ గురించి చెప్పి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారు. ఇంతకీ టీడీపీ జత కట్టేది ఎవరితోనో తెలుసా.. ? వైఎస్సార్ కాంగ్రెస్ తో అంటూ పవన్ ఇచ్చిన స్టేట్ మెంట్ కు అక్కడున్న మీడియా మిత్రులంతా షాక్ అయినట్లుగా చెబుతున్నారు. అంతేనా.. 2019 ఎన్నికల్లో బీజేపీ.. కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా బరిలోకి దిగుతాయంటూ మరో షాకింగ్ మాటను చెప్పారు.

ఆ మధ్యన చంద్రబాబు వీరావేశంతో మాట్లాడుతూ దేశాన్ని అవినీతిమయం చేస్తానంటూ నోరు జారటం తెలిసిందే. అయితే.. అది స్పీచ్ కే పరిమితమైంది. కానీ.. తాజా ఎపిసోడ్ లో జనసేన పార్టీ నేతలు తమ అధినేత పవన్ కల్యాణ్ తెలిసి తెలియకో చేసిన వ్యాఖ్యల్ని ఏ మాత్రం మార్చకుండా ప్రెస్ నోట్లలోనూ అదే రీతిలో పంపినట్లుగా చెబుతున్నారు.