మూడు ముక్కలుగా ఏపీ..పవన్ కొత్త ఆలోచన

0జనసేన అధినేత సినీనటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ఓ వైపు యాత్రతో ప్రజలతో కలుస్తూనే మరోవైపు తన జనసేన పార్టీ భావజాలాన్ని మేధావులు ఇతర వర్గాలకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆయన శ్రీకాకుళంలో మేధావులు – ప్రముఖులు – వివిధ వర్గాల ముఖ్యులతో భేటీ అయ్యారు. ప్రాంతీయ – జిల్లా – రాష్ట్ర అంశాలను చర్చించిన పవన్ ఈ సందర్భంగా సంచలన జోస్యం చెప్పారు. ఉద్దానంలో దశాబ్దాలుగా ఇంతమంది చనిపోతున్నాఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కాలేదని పవన్ అన్నారు. “ఈ సమస్యను బలంగా అందరి దృష్టికీ తీసుకువెళ్ళాం. ప్రభుత్వం లక్షన్నర మందికి పరీక్షలు చేశామంటోంది. ఆ జాబితా అంతా ఫేక్ అని విశాఖపట్నంకి చెందిన వైద్య నిపుణులే చెబుతున్నారు. ఆస్ట్రేలియా సంస్థ ద్వారా పరిశోధనలు చేయిస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఆస్ట్రేలియా సంస్థ అంటే దాని ప్రధాన కేంద్రం హైదరాబాద్ – బ్రాంచ్ ఢిల్లీ లోను ఉంటాయా? ఉద్దానం కిడ్నీ సమస్య విషయంలో మానవతా దృక్పథాన్ని మరచి దీన్నో మనీ మేకింగ్ ప్రాజెక్ట్ గా చూసి ఏదో మిగుల్చుకోవాలనుకొంటున్నారా“ అంటూ పవన్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాష్ట్రం మూడు ముక్కలు అవుతుందేమోనని కలకలం రేపే కామెంట్లు చేశారు.

రాష్ట్రంలో కాలుష్యకారకమైన పరిశ్రమలు… ప్రజల ప్రాణాలు – ఆరోగ్యాలతో చెలగాటమాడే పరిశ్రమలు ఏవైనా ఉంటే శ్రీకాకుళం జిల్లాలో పెట్టిస్తున్నారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు ఈ జిల్లాను ఓ డంపింగ్ యార్డ్ గా మార్చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర అనేది పాలకుల నిర్లక్ష్యానికి గురైన వెనకబడ్డదే తప్ప ఇక్కడ ప్రకృతి సంపదకీ సారవంతమైన భూమికీ లోటు లేదని చెప్పారు. “కొవ్వాడ దగ్గర అణు విద్యుత్ కేంద్ర ఏర్పాటు అంటే ఇక్కడ ప్రజల ప్రాణాలని పణంగా పెట్టడమే. కోస్తా వెంబడి 9 అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసి అగ్ని గుండంగా మార్చాలి అనుకొంటున్నారా? రష్యాలో చెర్నోబిల్ లో జరిగిన ఉపద్రవం లాంటిది సంభవిస్తే ఉత్తరాంధ్ర ఏమైపోతుంది. హుద్ హుద్ తుపాను వస్తే తల్లడిల్లిపోయాం కదా.. అణు విద్యుత్ కేంద్రం పెడితే పరిస్థితి ఏమిటి? అభివృద్ధి విషయంలో సమానత్వం పాటించకపోతే వేర్పాటువాదాలు వస్తాయి. నీళ్లు.. నిధులు… నియామకాల విషయంలో సమానత్వం పాటించకుండా అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం చేస్తే తెలంగాణ ఉద్యమం లాంటివి రాకుండా ఉంటాయా? ఆంధ్ర ప్రదేశ్ మళ్ళీ మూడు ముక్కలవుతుందా అనే ఆందోళన ఉంది“ అని అన్నారు.

చంద్రబాబు లాంటివాళ్ళు చేసే విధానాల మూలంగా సామాన్యులు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హైదరాబాద్ అభివృద్ధి అంటూ చేసిన మిగిలిన రాష్ట్రాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు అమరావతి విషయంలోనూ అవే తప్పులు చేస్తున్నారు. ఆమదాలవలస నుంచో పాతపట్నం నుంచో వెళ్ళినవాళ్ళు అమరావతిలో ఇల్లు కట్టుకొని ఉండే పరిస్థితి ఉందా? శ్రీకాకుళం నుంచి పొట్టకూటి కోసం హైదరాబాద్ వెళ్ళినవాళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అదే జరగబోతోంది. సగటు మనిషి కష్టం… నష్టం అన్నీ తెలుసుకొని సామాజిక పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నదే నా ఉద్దేశం“ అని అన్నారు.