అక్టోబర్‌ నుంచి జనంలోకి జనసేనాని

0తాను అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం చెప్పారు. సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

అక్టోబర్ నాటికి తన సినిమాలు పూర్తవుతాయని తెలిపారు. అక్టోబర్ నుంచి ప్రజల ప్రత్యక్షంగా కలుసుకొని పోరాడుతానని చెప్పారు. ప్రస్తుతం విభజన రాజకీయాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలను విడదీసే రాజకీయాలు అంటేతనకు భయం వేస్తుందన్నారు. సమాజంలో విభజించి పాలించే రాజకీయాలు చాలా ఉన్నాయని చెప్పారు.

తాను కాపు కులానికి చెందిన వాడినని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ తనకు చిన్నప్పటి నుంచి కుల, మతాలు పట్టవని చెప్పారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక దాని గురించి మాట్లాడక తప్పని పరిస్థితి అన్నారు. ముద్రగడ శాంతియుతంగా పాదయాత్ర చేస్తానంటే అనుమతి ఇవ్వాల్సింది అన్నారు. పలకరించడానికి వెళ్తే అది శాంతిభద్రతలకు విఘాతం అనుకోవద్దన్నారు.కాపుల అంశంపై మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఆర్ కృష్ణయ్య సహా ఎవరూ మాట్లాడలేదన్నారు. ఇప్పుడు దీనిని ఎందుకు ప్రశ్నిస్తున్నారని అభిప్రాయపడ్డారు. మనస్ఫర్తిగా ఈ విషయాలను అందరూ అర్థం చేసుకోవాలన్నారు. లా అండ్ ఆర్డర్‌తోనే సమస్యలు అన్నీ పరిష్కారం కావని చెప్పారు. తనకు కులాన్ని ఆపాదించవద్దన్నారు.

నంద్యాల ఉప ఎన్నికలపై రెండు రోజుల్లో నిర్ణయం చెబుతానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా అంశాన్ని కావాలనే నిర్వీర్యం చేశారని పవన్ అన్నారు. హోదాపై తన పోరాటం ఆగలేదని చెప్పారు.

గోదావరి అక్వా పార్కు విషయంలో నిబంధనలు పాటించాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. నిబంధనలు పాటిస్తే వాటిని ప్రజలకు చెప్పాలని చెప్పారు.

పాదయాత్ర చేస్తారా అని అడిగితే తనకు పాదయాత్ర చేయడం ఇష్టమేనని పవన్ కళ్యాణ్ చెప్పారు. జనసేన కార్యకర్తలు సహకరిస్తే పాదయాత్ర చేస్తానన్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు అవసరమైతే పాదయాత్ర, రోడ్డు షో, మీడియాతో మాట్లాడటం, ఆయా ప్రాంతాల్లో మేధావులతో మాట్లాడటం చేస్తానన్నారు.

గరపగర్రు అంశాన్ని తాను రాజకీయం చేయదల్చుకోలేదని చెప్పారు. ఇలాంటి అంశాన్ని సామరస్యంగా పరిష్కరించాలన్నారు. గరపగర్రు చాలా సున్నితమైన అంశమని, అందుకే తాను స్పందించలేదన్నారు. సామాజిక బహిష్కరణ పెద్ద నేరం అన్నారు.

అల్లూరి సీతారామరాజు గిరిజనులతో కలిసి పని చేశాడని, కానీ ఆయనను ఓ కులానికి పరిమితం చేయడం దురదృష్టకరమన్నారు. అంబేడ్కర్ వంటి మహనీయుడిని ఓ కులానికి, మతానికి పరిమితం చేయడం సరికాదన్నారు. అంబేడ్కర్ ఏ ఒక్క వర్గానికో నాయకుడు కాదని, అందరికీ ప్రియతమ నాయకుడు అన్నారు. అల్లూరి సీతారామరాజు కూడా అందరి వాడన్నారు.