ఒక్కో కార్యకర్త 500 ఓట్లు వేయించాలి:పవన్

0ఆలూ లేదూ చూలూ లేదూ….కొడుకు పేరు సోమలింగం అని…వెనకటికి ఓ సామెతుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఈ సామెత సరిగ్గా అతుకుతుంది. జనసేన పార్టీని స్థాపించి నాలుగేళ్లు గడుస్తున్నా….ఇప్పటికీ పార్టీ వ్యవస్థాగత నిర్మాణంపై పవన్ పూర్తిగా దృష్టి పెట్టలేదనే చెప్పాలి. అసలు ఆ మాటకొస్తే పవన్ మినహా ఆ పార్టీలో ఒకరిద్దిరు మినహా పెద్దగా నేతలెవరు కనబడడం లేదు. పైగా రాబోయే ఎన్నికలలో జనసేన మేనిఫెస్టో ఏమిటి….అన్నదానిపై పవన్ కైనా ఓ క్లారిటీ ఉందో లేదో తెలియని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. ఆ సంగతి పక్కనబెడితే…మొన్నటివరకు తనకు సీఎం పదవి పై ఆసక్తిలేదని చెప్పిన పవన్….తాజాగా తనను సీఎం చేయండంటూ ప్రజలకు విన్నపాలు చేయడంపై సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమయ్యాయి. ఆ సంభ్రమాశ్చర్యాలకు కొనసాగింపుగా పవన్ తాజాగా మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కావడానికి ఒక్కో కార్యకర్త 500 ఓట్ల చొప్పున వేయించాలని పవన్ తన మనసులోని వినూత్న కోరికను బయటపెట్టారు. జనసేన ఓ కంపెనీ లా భావించి ఒక్కో కార్యకర్తకు 500 ఓట్ల టార్గెట్ ఇచ్చినట్టున్న పవన్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో పవన్ పోరాట యాత్ర కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన మొదలైనప్పటి నుంచి పవన్ …సీఎం కుర్చీ నామస్మరణ చేస్తున్నారు. అదీగాక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 37 సీట్లతో సీఎం అయిపోయిన కుమారస్వామిని పవన్ ఇన్ స్పిరేషన్ గా తీసుకున్నట్లున్నారు. అప్పటినుంచి సీఎం పదవీ కాంక్ష మరింత పెరిగినట్లుంది. అందుకే తాను సీఎం కావాలంటే తానేం చేయాలో క్లారిటీ లేని పవన్…..తన కార్యకర్తలకు మాత్రం దిశానిర్దేశం చేశారు. తాను ముఖ్యమంత్రి కావడానికి ఒక్కో కార్యకర్త 500 ఓట్లు వేయించాలని పవన్ షాకింగ్ కోరిక కోరారు. పవన్ వ్యాఖ్యలకు కార్యకర్తలు ఖంగుతిన్నారు. మరోవైపు తాను సీఎం అయితే ఏం చేస్తాననే దానిపై పవన్ క్లారిటీ ఇవ్వలేదు. కేవలం టీడీపీ – వైసీపీలను విమర్శించడం….చంద్రబాబు జగన్ లను దుయ్యబట్టడం ఎజెండాగా పవన్ ముందుకు సాగుతున్నారు. కానీ ప్రజల ఆకాంక్షలు – కోరికలు – సమస్యలు గుర్తించి హామీలు ఇవ్వడం లేదు. తన పర్యటన ముగిసిన తర్వాత మేనిఫెస్టో విడుదల చేస్తానని మాత్రం చెప్పారు. అయితే ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే సందర్భంగా పవన్ హామీలివ్వకపోవడం ఆయన అనుభవరాహిత్యానికి నిదర్శనమని చెప్పవచ్చు.

అయితే గతంలో తన సినిమాల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పవన్…తన సినిమా బాగుంటుంది….సూపర్ హిట్…తప్పక చూడండి ….అని ప్రమోట్ చేసుకున్న దాఖలాలు లేవు. ప్రేక్షకులను అభిమానులను అలరించేందుకు కష్టపడి సినిమా తీశానని….జయాపజయాలతో తనకు పనిలేదని వేదాంత ధోరణిలో మాట్లాడేవారు. అయితే ఇపుడు రాజకీయాలకు కూడా దాదాపుగా అదే సూత్రం వర్తిస్తుందనే విషయాన్ని పవన్ మరచినట్లున్నారు. నిజంగా ప్రజల మనసు గెలుచుకుంటే….వారు గుండెల్లో పెట్టుకొని అభిమానించి పదవి కట్టబెడతారు. పదే పదే తనను సీఎం చేయండి….సీఎం అయ్యేందుకు ఇన్ని ఓట్లు వేయించండి అని కార్యకర్తలను అడగడం నిజంగా హాస్యాస్పదం. ఒకవేళ ఆ తరహా కోరిక సినిమాలకు వర్తిస్తుందేమోకానీ….రాజకీయాలకు సరిపోదు. ప్రజాసమస్యలను తెలుసుకొని….వాటిని పరిష్కరించేలా హామీలు ఇస్తే…వాటిని ప్రజలు విశ్వసిస్తే…జ్ఞా.ఓట్లు ఆటోమేటిక్ గా వేసి సిఎంను చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఆ సంగతిని పవన్ ఎప్పుడు గుర్తిస్తారో వేచి చూడాలి.